Yuvagalam padayatra: విశాఖలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదని... లోకల్ ఫేక్ సమ్మిట్ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 35వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అగ్రహారం వద్ద తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు లోకేశ్‌తో కలిసి పాదం కదిపారు. పీలేరు పట్టణంలో నారా లోకేష్‌ని చూసేందుకు యువత, ప్రజలు పోటెత్తారు. పీలేరులో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.
వైసీపీ నాయకులు యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారని... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గంజాయి సరఫరాదారుల తాటతీస్తామని లోకేశ్ అన్నారు. సే నో టూ గంజాయి అని లోకేశ్ యువతకు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారు గిఫ్ట్‌ల కోసం కొట్టుకున్నారన్నారు. ఫేక్ కంపెనీల ముసుగులో జగన్ 25 వేల ఎకరాలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని లోకేశ్ ఆరోపించారు. జగన్‌ని చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తొస్తాడని మండిపడ్డారు.
జగన్ సీఎం అయ్యాక దళితులను చంపేందుకు వైసీపీ నాయకులకు లైసెన్స్ ఇచ్చాడన్నారు. వైసీపీ రాక్షస పాలనలో ఎందరో అమాయకులు మృతిచెందారని లోకేశ్ విమర్శించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కాదని.. చింతల రామచంద్రారెడ్డిని గెలిపించుకున్న పీలేరు ప్రజలకు మిగిలింది చింతలేనని దుయ్యబట్టారు. నామమాత్రంగా మాత్రమే పీలేరుకు చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేనని.. అనాధికారికంగా పాపాల పెద్దిరెడ్డి కుటుంబ పాలన పీలేరులో సాగుతొందని ఆరోపించారు. కేక్ కోసుకొని తిన్నట్టు ప్రజల రక్తం త్రాగుతున్నారని విమర్శించారు. కొండలను ఆక్రమించి అక్రమ క్వారీలు నడుపుతున్నారన్నారు.