AP Mineral Development Corporation: అన్నమయ్య జిల్లాలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న మంగంపేటలోని ముగ్గురాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏడాది నుంచి దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే బెరైటీస్ ( ముగ్గురాయి) ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు ఎలాంటి బిల్లులు లేకుండా తరలించినట్లు తెలుస్తోంది. ఇది అంతర్గత విచారణలో వెల్లడి కాగా.. కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని పెద్దలను వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో ఏపీఎండీసీ ఆద్వర్యంలో ముగ్గురాయి గనుల తవ్వకాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఏపీఎండీసీ సంస్థకు 90 శాతం ఆదాయం ఈ మంగంపేట ముగ్గురాయి గనుల నుంచే లభిస్తోంది. అయితే ఉన్నతాధికారులు.. కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై ముగ్గురాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మంగంపేటలో లభించే ముగ్గురాయికి విదేశాల్లో మంచి డిమాండు ఉంది. మేలు రకం ముగ్గురాయి ఖనిజం ఇక్కడే ఎక్కువగా లభిస్తోంది. గనుల నుంచి తవ్వితీసిన ముగ్గురాయిని ఏ,బీ,సీ,డీ గ్రేడులుగా విభజిస్తారు. వేలం ద్వారా ముగ్గురాయి దక్కించుకున్న వ్యాపారస్తులు.. నిత్యం యార్డు నుంచి తరలిస్తారు. ఈ లెక్కన రోజుకు 500 ట్రిప్పుల మేర ముగ్గురాయి తరలివెళ్తోంది. ఒక్కో ట్రిప్పుకు 18 టన్నుల ముగ్గురాయి రవాణ చేస్తున్నారు. వాటిని వే బ్రిడ్జిలో తూకం వేసి ఇతర ప్రాంతాలకు రవాణ చేయడానికి వే బిల్లులు రూపంలో రశీదులు కూడా జారీ చేయాల్సి ఉంది. కానీ దీని ముసుగులో రోజుకు ఐదారు లారీలు ఎలాంటి బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నట్లు ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో వెల్లడైంది.