Low Rainfall Conditions in State : రాష్ట్రంలో ఈసారి నైరుతి రుతుపవనాలు రైతులను మోసం చేయగా, ఆదుకోని ప్రభుత్వంతో అన్నదాతలు అన్నివిధాలా నష్టపోతున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి రుతుపవనాలు దోబూచులాటతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పటికే చిరుజల్లులతో నేలపదునైన చోట విత్తనం వేసిన రైతులు, మళ్లీ చినుకు జాడ లేకపోవటంతో మొక్క దశలోనే పైరు ఎండిపోతోంది.
Farmers Huge Loss Due To Power Cuts :జూన్ నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాలుండగా, 13 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 50 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, శ్రీ సత్యసాయి జిల్లా 41 శాతం వర్షపాత లోటుతో రెండో తీవ్ర వర్షాభావ జిల్లాకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి ఆగస్టు 26 వరకు 393 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 304 మి.మీ నమోదైంది. ఏపీలో ప్రస్తుతం 23 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. వర్షం రాకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. సీజన్ మొదలైనప్పటి నుంచి బండ తడుపు వానలే తప్ప ఒక్క రోజు కూడా నేల పదును వర్షాలు నమోదు కాలేదు. సీమలోని ఎనిమది జిల్లాల్లో ఏడు జిల్లాలు తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో కూడా 19 శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ, వాతావరణ శాఖ దీన్ని వర్షాభావంగా పరిగణించకుండా సాధారణ వర్షపాతంగా చూస్తోంది.
Interview With Dr. Ashok on Anantapuram Crops: చిరుధాన్యాలు సాగుచేస్తే నష్టం తప్పించుకోవచ్చు: డా. అశోక్
Farmers Problems :అనంతపురం జిల్లాలో 31 శాతం లోటు వర్షపాతంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ జిల్లాలో ఈ సీజన్ లో 190 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 131 మి.మీ మాత్రం కురిసింది. 31 మండలాలకు గాను 25 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దపప్పూరు మండలంలో అత్యధికంగా 55 శాతం లోటు వర్షపాతం నమోదుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 41 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఆ జిల్లాలో జూన్ నుంచి నేటి వరకు 213 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 127 మి.మీ మాత్రమే కురిసింది. సత్యసాయి జిల్లాలోని 32 మండలాలకు గాను 28 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ జిల్లాలో అత్యధికంగా ముదిగుబ్బ మండలంలో 71 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ముదిగుబ్బ మండలం రాష్ట్రంలోనే అత్యధికంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో సాగుచేసిన కంది, వేరుసెనగ, ఆముదం, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ జిల్లాల్లో సింహభాగం విస్తీర్ణంలో సాగుచేసే వేరుసెనగ చాలా వరకు దెబ్బతినింది. చెట్లు ఊడలు దిగే సమయంలో వర్షం కురవకపోతే, ఆలస్యంగా వర్షాలు వచ్చినా వేరుసెనగ పంటకు పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Farmers Protest At Electricity Substation : 15రోజులుగా పవర్ కట్.. ఎండుతున్న పంటలు.. సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు
చాలా గ్రామాల్లో రైతులు వేరుసెనగ విత్తనం సిద్ధం చేసిపెట్టుకొని, సకాలంలో వర్షం రాకపోవటంతో అదనుదాటిపోయి విత్తనాన్ని కిరాణ దుకాణాలు, హోటళ్లకు విక్రయిస్తున్నారు. దాదాపు 35 రోజులుగా చినుకు జాడలేకపోవటంతో పలు పంటలు వాడుపడుతున్నాయి. బోర్ల కింద వేసిన పంటలు కూడా వేసవిని తలపించే ఉష్ణోగ్రతల కారణంగా అందిన నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. రైతులకు ప్రకృతి కలిగించే నష్టం చాలదన్నట్లుగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా తీవ్రమైన విద్యుత్ కోతలు అన్నదాతను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి.
చాలా మండలాల్లో వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని అన్నదాతులు రోడ్డెక్కుతున్నారు. బోర్లలో నీరున్నా పైరుకు అందించలేకపోతున్న రైతులు కళ్లెదుటే పంట ఎండుతున్న తీరును చూసి తట్టుకోలేకపోతున్నారు. మరో వారం రోజులపాటు పంటలను బతికించే వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ ప్రకటించటంతో అన్నదాతలంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రానున్న వారం రోజులు వర్షాలు లేవంటూ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతూ కొందరు, అదును దాటిపోయి విత్తనమే వేయలేక మరికొందరు తీవ్రంగా నష్టపోతుండగా ప్రభుత్వం కనీసం ఆదుకుంటామనే ప్రకటన కూడా చేయటం లేదు. మరో వైపు అన్నివిధాలా నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఉచితంగా ఇవ్వగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాటిని కూడా రాయితీతో కొనాల్సిందేనని రైతులకు చెప్పింది.
Farmers Pelt Stones on Substation in Peruru Sathya Sai District: సబ్‌స్టేషన్‌పై రాళ్లు విసిరిన రైతులు.. అధిక విద్యుత్ కోతలంటూ..
Low Rainfall Conditions in State: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. విద్యుత్ కోతలు.. ఇబ్బందుల్లో అన్నదాతలు