Jamun fruits: వరుస నష్టాల కారణంగా.. సాగు అంటేనే రైతు బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లోనూ.. లాభాల బాటలో సాగుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన నెట్టెం రమణ. కర్ణాటక, మహారాష్ట్ర రైతుల నుంచి గట్టి పోటీని తట్టుకుని.. అల్లనేరేడు పంటతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. రాకెట్ల గ్రామంలో చాలా మంది రైతులు.. వంద ఎకరాలకు మించిన భూస్వాములే. వ్యవసాయం కలిసిరాక.. అనేక మంది రైతులు సాగును వదిలేశారు. ఇంకొందరు.. పండ్ల తోటలు పెంచి.. పెట్టుబడికి తగిన దిగుబడి రాక.. చెట్లను కొట్టేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. పదేళ్ల కిందట నాటిన పదెకరాల అల్ల నేరేడు చెట్లతో..నెట్టెం రమణ నేటికీ ఏటా 30 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. పుట్టిన ఊరును, నమ్ముకున్న నేలను వదలకుండా.. 73 ఏళ్ల వయసులోనూ.. నేరేడు, ఉసిరి, మామిడి తోటలను సాగుచేస్తున్నారు. ప్రణాళికతో వ్యవసాయం చేస్తూ.. నాణ్యమైన దిగుబడి సాగిస్తున్నారు.
నెట్టెం రమణకు 150 ఎకరాల భూమి ఉంది. దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయ పరిశోధనాలయాలకు వెళ్లడం.. రైతుల్ని కలిసే అలవాటున్న రమణ.. తన భూమిలో పంటలపై అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతంలోనూ.. వర్షాల ఆధారంగానే.. ఉద్యాన పంటలు సాగుచేశారు. ఇజ్రాయెల్ దేశంలో బిందుసేద్యాన్ని పరిశీలించడానికి.. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం పంపిన రైతుల బృందంలో రమణ ఒకరు. అక్కడ తెలుసుకున్న పరిజ్ఞానాన్ని.. తన గ్రామంలో అనేక మంది రైతులకు నేర్పించారు. పదేళ్ల క్రితం ఆర్డీటీ సంస్థ నుంచి పది రూపాయలకు ఒక మొక్క చొప్పున 14 వందల అల్ల నేరేడు చెట్లను కొనుగోలు చేసి..తోటలో నాటారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు పాటిస్తూ.. నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నారు.
లాభసాటి సాగుపై అవగాహన కల్పించేందుకు..వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల్ని..రమణ సాగు చేస్తున్న తోటలకు తీసుకువస్తుంటారు. రమణ అనుసరిస్తున్న విధానాలను వివరిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకొని.. ముందుకు వెళితేనే.. లాభాలు సాధ్యమని.. రైతు నెట్టెం రమణ చెబుతున్నారు.
అల్లనేరేడు సాగు.. రైతుకు లాభాలు బహుబాగు ఇవీ చూడండి: