Hydro Power Project in Annamayya District: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల గ్రామంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం తమ పంట భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులంతా సోమవారం టీడీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకుల మద్దతుతో అన్నమయ్య కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ గోడును స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీషకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఏడాదికి మూడు పంటలు పండుతున్న భూములతో పాటూ.. మామిడి తోటలు వేసుకుని అవే జీవనాధారంగా జీవిస్తున్నామని తెలిపారు. తమకు ఇతర వేరే ఏ మార్గం లేక భూములపైన ఆధారపడ్డామని రైతులు వెల్లడించారు. అలాంటి భూములు ఉన్నపళంగా ప్రభుత్వం లాక్కుంటే తమ బతుకులు వీధిన పడతాయని రైతులు వాపోయారు.
అంతేకాకుండా నీటిని పవర్ ప్రాజెక్టు కోసం తోడేస్తే, తమ పంట పొలాలు బీడుగా మారుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు నాలుగు గ్రామాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. తామంతా వ్యవసాయ భూములను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బాధిత రైతులు వాపోయారు. ఇటీవల గ్రామంలో అధికారులు నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశానికి వైసీపీ నాయకులు, మద్దతుదారులు మాత్రమే హాజరైనట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటు అత్యవసరమని చెప్పడంతో వారి అభిప్రాయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారని వెల్లడించారు. రైతులు చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమ భూములను తీసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు. లేనిపక్షంలో తాము గ్రామాలు వదిలి వెళ్లి పోవాల్సి వస్తుందని వంగిమళ్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.