ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ కొత్త డీజీపీ రేసులో ఆ ఇద్దరు.. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉత్కంఠ..! - ts new dgp

TS NEW DGP: తెలంగాణలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో ఆ స్థానంలో ఎవరు నియమితులవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన అధికారులలో ఒకరికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్‌ లేదా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాలలో ఒకర్ని నియమించే అవకాశం ఉంది.

TS NEW DGP
TS NEW DGP

By

Published : Dec 29, 2022, 10:30 AM IST

TS NEW DGP : మరో మూడు రోజుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన ఇప్పుడున్న అర్హులైన అధికారులలో ఒకరికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్‌ లేదా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాలలో ఒకర్ని నియమించే అవకాశం ఉంది.

దీనికి సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు వెలువడవచ్చని భావిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరొకర్ని ఎంపిక చేయాల్సి ఉన్నా.. సర్కారు ఇప్పటివరకు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్‌ దాఖలు చేసిన కేసును విచారించిన సుప్రీంకోర్టు, దేశంలో పోలీసు సంస్కరణలకు సంబంధించి 2006లో మార్గదర్శకాలు జారీ చేసింది.

యూపీఎస్సీ చెప్పిన వారిలో ఒకరు..: ఆ ప్రకారం అర్హులైన ఐదుగురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ ముగ్గురిని ఎంపిక చేస్తుంది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. దీనిపై సుప్రీంకోర్టులోనే అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ 2018లో ‘తెలంగాణ పోలీసు (సెలక్షన్‌ అండ్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్-హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) యాక్ట్‌’ పేరుతో తెలంగాణ శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది.

ఆ బిల్లు ప్రకారమే ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం జరిగింది. వాస్తవంగా గత డీజీపీ అనురాగ్‌శర్మ పదవీ విరమణ చేసినప్పుడు (2017 నవంబరు 12న) హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డిని తాత్కాలిక ప్రాతిపదికన ఆ స్థానంలో నియమించారు. సవరించిన ‘తెలంగాణ పోలీసు యాక్ట్‌ 2018’ను మార్చి 10 తేదీన గెజిట్‌లో ప్రచురించి.. దాన్ని అనుసరించి 2018 ఏప్రిల్‌లో మహేందర్‌రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంజనీకుమార్​వైపు సర్కార్​ మొగ్గు :ఇప్పుడూ అదే విధానం అనుసరించాలని సర్కారు భావిస్తోంది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ తర్వాత సీనియారిటీ జాబితాలో 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్‌, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌, రవిగుప్తాలు ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రానికి రెండు క్యాడర్‌, రెండు ఎక్స్‌క్యాడర్‌ డీజీపీ పోస్టులు ఉన్నాయి. నవంబరులో పదవీ విరమణ చేసిన గోవింద్‌సింగ్‌ స్థానంలో.. అదనపు డీజీ స్థాయి అధికారికి డీజీపీగా పదోన్నతి ఇవ్వవచ్చు. ఈ లెక్కన సీనియారిటీ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్న రాజీవ్‌రతన్‌కు ఆ అవకాశం దక్కుతుంది. ఆయన మినహా మిగిలిన ముగ్గురి నుంచే ఒకర్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అంజనీకుమార్‌ వైపు సర్కారు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన అధికారి. న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌దీ అదే పరిస్థితి.

ఆచితూచి అడుగులు..: సోమేశ్‌కుమార్‌ క్యాడర్‌కు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. వచ్చే నెలలో దీనిపై తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ సోమేశ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించే పక్షంలో ఆ ప్రభావం అంజనీకుమార్‌ నియామకంపైనా పడుతుంది. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యే మార్గంగా తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయవచ్చని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details