Criminal Case Registered Against Sub Registrar Shyamaladevi : అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన 13 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కడప గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌పై రిఫ్యూసల్ ఆర్డర్ జారీ చేశారు. యధాతథంగా ప్రభుత్వ భూమి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ శ్యామలాదేవిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ విభాగానికి బదిలీ చేశారు. శ్యామలాదేవిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రాయచోటి పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది : రాయచోటి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వైసీపీ ప్రజాప్రతినిధి కుట్రపై... ఈటీవీ-ఈనాడు కథనాలతో అధికారులు స్పందించారు. అక్రమార్కులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి మాసాపేటలో సర్వే నంబర్ 971/1లోని 83 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలను కలెక్టరేట్ సముదాయానికి, 30 ఎకరాలను వివిధ ప్రభుత్వ శాఖల భవనాలకు కేటాయించారు. మిగిలిన 13 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
రాయచోటిలో కాకుండా కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెండింగ్ రిజిస్ట్రేషన్ కింద గత నెల 9న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాయచోటి మాసాపేటకు చెందిన షేక్ హరూన్‌బీ, ఆమె కుమారుడు షేక్ ఖాదర్ బాషాల నుంచి.. లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడుకు చెందిన వైసీపీ నాయకులు హరినాథ్‌రెడ్డి, జింకా రమేశ్, తాడిపత్రికి చెందిన గజేంద్రరెడ్డి, రాయచోటికి చెందిన యూసుఫ్ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు 30 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.