ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవగాహన సదస్సు.. సీనియర్ల హాజరుపై ఉత్కంఠ - ఆంధ్రప్రదేశ్ ఈరోజు వార్తలు

Congress Awareness Conference: శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు పీసీసీ సిద్ధమైంది. అంశాల వారీగా చేసే పోరాటాలపై నాయకులకు అవగాహన కల్పించేందుకు నేడు బోయిన్‌పల్లిలో అవగాహన సదస్సు నిర్వహించనుంది. అయితే.. పీసీసీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు ఈ సదస్సులో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు 'హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌' సదస్సుకు రావాలా? వద్దా? అని సీనియర్లు తర్జనభర్జనలు పడుతున్నారు.

congress meeting
నేడు కాంగ్రెస్ అవగాహన సదస్సు

By

Published : Jan 4, 2023, 10:26 AM IST

Congress Awareness Conference: కాంగ్రెస్‌ నాయకులు టీవీ చర్చల్లో పాల్గొని, ఇతర పార్టీల నేతలకు దీటుగా సమాధానం చెప్పేలా పీసీసీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. తరచూ ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి ఆయా అంశాలపై నిపుణులతో చర్చించేలా చూడాలని పీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా 'హాత్‌ సే హత్‌ జోడో అభియాన్‌'పై సన్నాహక కార్యకమంతోపాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇవాళ సికింద్రాబాద్‌ బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సదస్సు ఏర్పాటు చేసింది.

ఎవరెవరు ఏ జిల్లాలో పాదయాత్ర చేయాలి: మొదటి సెషన్‌లో ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత జనవరి 26 నుంచి చేపట్టనున్న 'హాత్ సే హాత్ జోడో అభియాన్' కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఎవరెవరు ఏ జిల్లాలో పాదయాత్ర చేయాలి.. యాత్రలో ప్రజల్లోకి ఏయే అంశాలను తీసుకెళ్లాలనే అంశాలను నాయకులకు సూచిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. పార్టీ పీఏసీ, పీఈసీ, అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని విభాగాల ఛైర్మన్‌లు సహా 350 మంది నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సీనియర్‌ నేతలు హాజరవుతారా..? లేదా..?: ఈ సదస్సుకు పీసీసీ వ్యతిరేక వర్గమైన సీనియర్‌ నేతలు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వయంగా జోక్యం చేసుకుని.. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఇవాళ్టి సదస్సుకు హాజరు కావాలని సూచించారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు.. ఏలేటి మహేశ్వర్​రెడ్డికి ఫోన్‌ చేసి సదస్సుకు వెళ్లాలని సూచించారు. అప్పటివరకు మిన్నకుండిన సీనియర్లు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. వెళ్లాలా? లేదా? అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. సమస్య పరిష్కారం కాకుండానే.. సదస్సుకు వెళితే పరువు ఉండదని కొందరు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సదస్సుపై సమాచారం లేదంటున్న సీనియర్లు.. వేరే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.

'హాత్‌ సే హత్‌ జోడో అభియాన్‌' కార్యక్రమం చివర రోజున హైదరాబాద్‌లో జరిగే పాదయాత్రలో రాహుల్‌గాందీ హాజరవుతారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్‌ పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని సదస్సులో సీనియర్లు పాల్గొంటారా.. ఒకవేళ పాల్గొంటే.. ఎవరెవరు హాజరవుతారు.. అనే ఉత్కంఠ కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details