ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Annamayya Dam Victims Problems: "జగనన్న ఏమయ్యాయి నీ హామీలు.. మేం చేసుకున్న పాపం ఏంటి?"

Annamayya Dam Victims Problems: బాధితుల్ని ఓదార్చడంలో CM జగన్‌కు ఎవ్వరూ సాటిరారు..? నా అక్క, నా చెల్లి, నా అన్న అంటూ..ఆత్మీయత పంచుతారు. తలపై చేయి పెట్టి నేనున్నానంటూ.. భరోసా ఇస్తారు. కమ్మని హామీలిస్తారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకూ అలాంటి మాటలే చెప్పారు. కానీ అవేవీ వాళ్ల.. కడుపు నింపలేకపోయాయి. కన్నీళ్లు.. తుడవలేకపోయాయి. వరదలు ఊళ్ల మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లి ఏడాదిన్నరైనా.. బాధితులు కుదురుకోలేదు. మునుపటి జీవితానికి నోచుకోలేదు. కూడు, గూడు కోసం.. అల్లాడుతున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు... సీఎం జగన్‌ చెప్పిందేంటి.? ఏడాదిన్నరలో చేసిందేంటి..? ఇప్పుడు చూద్దాం.

Annamayya Dam Victims Problems
Annamayya Dam Victims Problems

By

Published : May 20, 2023, 8:30 AM IST

Annamayya Dam Victims Problems: దాదాపు ఏడాదిన్నర క్రితం.. వరదల కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది.? అన్నమయ్య ప్రాజెక్ట్‌ బాధితులకు ఏం న్యాయం జరిగింది? పొలాల్లో నేటికీ.. అవే ఇసుక మేటలు,. అసంపూర్తిగా ఇళ్లు.. గుడారాల్లోనే కాపురాలు.. ఎవర్ని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీళ్లే.

2021 నవంబర్‌ 19న అన్నమయ్య డ్యాం.. కొట్టుకుపోయింది. చెయ్యేరు నది ఒడ్డునున్న రాజంపేట మండలం.. పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తోగూరుపేట, రామచంద్రపురం, పాపరాజుపల్లె,. శేషమాంబపురం, రాచపల్లె, గుండ్లూరు గ్రామాల్లో సర్వం ఊడ్చేసి.. గుండెకోత మిగిల్చింది. విపత్తు జరిగిన 2 వారాలకు అంటే.. 2021 డిసెంబర్‌ 2న సీఎం జగన్‌.. బాధిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన అభాగ్యుల తలపై చేయిపెట్టి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఇది ఊహకందని విషాదం అంటూ.. గ్రామస్థుల్ని ఓలలాడించారు. హామీలతో ఊరడించారు. జగనన్న మాటలు.. నీటిమీద రాతలే అయ్యాయి. సంవత్సరంన్నర కాలంలో.. నిలువనీడ కల్పించలేకపోయాయి. దాతల చేయూతతోనే బాధితులు కాలం గడిపపారు..

ఇన్ని నెలల నుంచి దాతలిచ్చిన సరుకులతో బతికాం. జీవనానికి ప్రభుత్వం తరఫున ఏ సాయం చేయలేదు. ఇళ్లు మంజూరు చేసి గుత్తేదారుకు అప్పగిస్తే పునాదుల్లోనే పనులు ఆపేసి వెళ్లిపోయారు. పాములు, తేళ్లున్న ప్రాంతంలో మండుటెండలో గుడారాల్లో జీవిస్తున్నాం. మాలాంటి బతుకు ఎవరికీ రాకూడదు’-బాధితులు

నాటి జలవిలయంలో 453 ఇళ్లు నేలమట్టం కాగా.. 601 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో సామాన్లు,. గొడ్డూ, గోద ఏమీ మిగల్లేదు. వరదల్లో కొందరు కొట్టుకుపోగా.. ప్రాణాలతో బయటపడ్డవారు కట్టుబట్టలతో మిగిలారు. వారందరకీ ఇళ్లు కట్టిస్తామని జగన్‌ ఇచ్చిన హామీ ఇది. ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 30.12 ఎకరాలు సేకరించి 5చోట్ల లే అవుట్లు వేశారు. పులపుత్తూరులో 3 లే అవుట్లు వేశారు. తొగూరుపేట, మందపల్లె లే అవుట్లలో.. 409 మందికి స్థలాలు కేటాయించారు. కొండ ప్రాంతంలో నివాసయోగ్యం కాదంటూ.. సుమారు 120 మంది ఇప్పటిదాకా వాటిని తీసుకోలేదు. ప్రత్యామ్నాయం చూపాలన్న విజ్ఞప్తికి దిక్కూమొక్కూలేదు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం.. 434 ఇళ్లు కేటాయించింది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించి నిధులు విడుదల చేయడం మర్చిపోయారు.

"మా వైపు ఎవరూ తిరిగి చూడలేదు. ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. పేదవాళ్లం. నానాతిప్పలు పడుతున్నాం. గుట్టలపై ఇళ్ల స్థలాలిచ్చారు. అవి నివాసయోగ్యంగా లేవు. ఇళ్లు కట్టించి తాళాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు"-బాధితులు

ఇస్తామన్న 5 లక్షల్లో లక్షా80వేలు.. కేంద్రం ఇచ్చేదే. మిగతా 3లక్షల20 వేలూ రాష్ట్రం ఇవ్వకపోవడంతో.. ఇళ్ల నిర్మాణం ఇలా మిగిలిపోయింది. 135 ఇళ్లు పునాది దశలో ఉంటే.. 143 గృహాలు దానికీ నోచుకోలేదు. మిగితా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కేటాయించిన ఇళ్లలో సగం వరకూ నిర్మాణ బాధ్యతను.. గుత్తేదారుకు అప్పగించారు. చేసిన పనులకు కోటి రూపాయల వరకూ.. బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశారు. ఇళ్లు కోల్పోయిన వారిలో... కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటుంటే,... సుమారు 124 కుటుంబాలు గుడారాల్లో తలదాచుకుంటున్నారు. కనీసం మరుగుదొడ్లు లేక మహిళల పాట్లు వర్ణనాతీతం. తాత్కాలిక మరుగుదొడ్లు మూణ్నాళ్లకే.. దెబ్బతిన్నాయి. వాటిపై కప్పుగా వేసిన రేకులు ఈదురుగాలులకు చెల్లాచెదురయ్యాయి.

ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన మరో హామీ:దాదాపు 271 మందికి చెందిన 127.09 హెక్టార్ల భూముల్లో.. ఇసుక మేటలు వేశాయి. హెక్టారుకు రూ.12వేల 500 వేల చొప్పున.. కొందరికే ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకున్న గుత్తేదారు సంస్థే కొన్ని భూముల్లో ఇసుక తీసి విక్రయించుకుంది. కొన్ని భూముల్లో ఇసుక, మట్టి కలసి ఉందని, అది పనికిరాదని అలాగే వదిలేశారు. ఇంకా 50 హెక్టార్ల వరకూ.. భూమి ఇసుక మేటల వల్ల సాగులోకి రాలేదు. వాటిని పూర్వస్థితికి తేవాలంటే... ఎకరాకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని.. రైతులు వాపోతున్నారు. విపత్తులో 989 పశువులు ప్రాణాలు కోల్పోగా.. 376 పశువులకే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అందులోనూ ఇంటికొక పశువుకే ఆర్థిక సాయం చేసింది.

ఇక జగనన్న ఇచ్చిన మరో హామీ ఉపాధి కల్పన:గతేడాది జనవరిలో 3 రోజులు జాబ్‌మేళా నిర్వహించగా.. సుమారు 180 మంది హాజరయ్యారు. వారిలో కొందరిని ఎంపిక చేశారు. నెలకు 10 నుంచి15వేలలోపు వేతనం ఇస్తామని చెప్పారు. అంత తక్కువ జీతానికి.. దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ముందుకురాలేదు. అలా ఉద్యోగ కల్పన.. ఉత్తమాటగానే మిగిలింది. ఇవే కాదు అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఏడాదిన్నర కాలంలో పరిపూర్ణం కాలేదు. వరదల్లో.. కొట్టుకుపోయిన ఆటోలు, బైకులకు సాయం చేస్తామన్నా.. వాటికి పైసా పరిహారం ఇవ్వలేదు. ఇక పింఛ, అన్నమయ్య డ్యాంల పునర్మిర్మాణం గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడమీ కట్టలేదు.

అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి.. రూ.870 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేశారు. కానీ 2023-24 బడ్జెట్‌లో కేవలం.. రూ.20 లక్షలే కేటాయించారు. పురోగతి సర్వే పనులకే పరిమితమైంది. చెయ్యేరు నదికి ఇరువైపులా రక్షణ గోడ కూడా కడతామన్నారు. 3 కోట్లతో పనులు చేపట్టారు. వైసీపీలోని ఇరువర్గాలు పనులు పంచుకుని.. నాణ్యతను గాలికొదిలేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులతో.. పనులు మధ్యలోనే నిలిపేశారు. ఈ ఏడాదిన్నరలో.. ప్రభుత్వం కొన్ని వేల కోట్లు అప్పులు చేసింది. జగన్‌ నెలకొక బటన్‌ నొక్కుతూ సంక్షేమ పథకాలకు నిధులు.. ఇస్తున్నారు. కానీ అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కోసం ఒక్క బటన్‌ కూడా నొక్కలేదు? మేం చేసుకున్న పాపం ఏంటని.. బాధితులు ఆక్రోశిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details