వైకాపా నేతల మధ్య ఘర్షణ.. రివాల్వర్‌తో ఓ నాయకుడి హల్‌చల్ - YCP Groups Clashes news
16:06 May 14
తుపాకీతో హల్‌చల్ చేస్తూ బెదిరించిన ఒకవర్గం నేత
Clashes Between YSRCP Groups: భూమి విషయంలో నెలకొన్న వివాదంలో వైకాపాకు చెందిన రెండు వర్గాలు పోలీసుల ఎదుటే పరస్పరం రాళ్ల దాడులకు దిగాయి. శనివారం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్కిరెడ్డిపల్లెలో 1.05 ఎకరాల స్థలాన్ని మొదట 2019లో చిన్నమండెం మండల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మేఘన బావ, వైకాపా నాయకుడు శ్రీనివాసులురెడ్డి కొనుగోలు చేశారు. ఆ భూమికి డిమాండ్ పెరగడంతో పూర్వపు యజమానుల నుంచి 2022లో వైకాపాకు చెందిన లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ ఎం.సుదర్శన్‌రెడ్డి అనుచరులు ఎం.నరసింహరాజు, సభాపతినాయుడు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ఒకే భూమి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసినట్లయింది.
ఈ క్రమంలో ఎం.నరసింహరాజు, సభాపతినాయుడు భూమిని చదును చేయించి ప్లాట్లుగా మార్చారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి కోర్టును ఆశ్రయించి, ఆయనకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. శనివారం శ్రీనివాసులురెడ్డి తన అనుచరులతో కలిసి స్థలంలో పనులు చేస్తుండగా ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల ఎదుట జరిగిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వెంటనే రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్, లక్కిరెడ్డిపల్లె సీఐ జి.రాజు అక్కడికి చేరుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణలో శ్రీనివాసులురెడ్డికి చెందిన వాహనం ధ్వంసమైంది. వాహనంలో మారణాయుధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి శ్రీనివాసులురెడ్డి రివాల్వర్ తేగా పోలీసులు వారించారు. శ్రీనివాసులురెడ్డి, సుదర్శన్‌రెడ్డికి చెందిన లైసెన్సు కలిగిన రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. సభాపతినాయుడు, శ్రీనివాసులురెడ్డి పరస్పరం ఫిర్యాదు చేసుకోగా పలువురిపై కేసులు నమోదు చేశామని లక్కిరెడ్డిపల్లె సీఐ జి.రాజు తెలిపారు.
ఇదీ చదవండి:KGF WEAPON: ఇదో నయా ట్రెండ్... హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా