"ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ కూడా అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా" అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఆదివారం "సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర" నంద్యాలలో ప్రారంభమై కర్నూలు, గుత్తి, పామిడి మీదుగా అనంతపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన వివిధ సభల్లో పలువురు మంత్రులు మాట్లాడారు.
బస్సు యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మంత్రి ధర్మాన ప్రసంగించారు. "రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరిగాయి. అయినా అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని వ్యాఖ్యానించవద్దు. ఎందుకు జరుగుతాయి ? మన అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే.. అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుంది. గడిచిన 75 సంవత్సరాల్లో వీటిని తీర్చి ఉంటే అవి ఇప్పుడు ఉండేవి కావు కదా ? మా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకే కొన్ని పనులు ఆలస్యమవుతాయి. బడుగులు గౌరవంగా బతికే స్థాయికి ఎదిగిన తర్వాత వాటిని వచ్చే కాలంలో చేద్దాం. తొందరేమీ లేదు." అని ధర్మాన పేర్కొన్నారు. గతంలో జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అసలు ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదన్నారు. ఈ క్రమంలో సంక్షేమ కార్యక్రమాలకు లక్షా 48 వేలకోట్లు వ్యయం చేస‌్తున్నామంటూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పుకొస్తే.. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ధర్మాన ప్రసాదరావు సెలవిచ్చారు.
మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రసంగిస్తూ.. మహానాడులో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా కొట్టి చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. "జగన్‌ది రామరాజ్యమని.. చంద్రబాబుది రాక్షస పాలన"అని పేర్కొన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బడుగులకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుతున్నారని చెప్పారు.
కర్నూలులో జరిగిన సభలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం షెడ్యూలు కులాల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే.. వైకాపా ప్రభుత్వంలో 4 పదవులిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని పేర్కొన్నారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రసంగిస్తూ.. "చంద్రబాబు.. మీ పని అయిపోయింది. 2019లో 23 సీట్లు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో మూడే వస్తాయి" అని పేర్కొన్నారు. నంద్యాలలో మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తెదేపా ఓట్ల కోసం ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చిందని, లేదంటే మైనారిటీలకు చోటే లేదని విమర్శించారు. ఆయా సభల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, విడదల రజిని, జోగి రమేష్, తదితరులు పాల్గొన్నారు.