YSRCP Leaders Sexual Harassment on Women: తప్పు చేసినా అడిగే ధైర్యం ఎవరికీ లేదని భావించినప్పుడు.. తానేం చేసినా అధికారంలో ఉన్నవారు మద్దతిస్తారని అనుకున్నప్పుడు మృగాళ్లు తయారవుతారని.. 2018 మే 5న కృష్ణా జిల్లా పెడన సభలో జగన్ ఘనంగా నీతులు వల్లించారు. నాడు చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. కొందరు వైసీపీ నాయకులు.. వారి కుటుంబ సభ్యులు అరాచకాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కాపాడతారనే ధీమాతో రెచ్చిపోతున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఓ దళిత మహిళపై కొందరు వైసీపీ నాయకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి బెదిరిస్తూ ఏడాదిగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ఆ దృశ్యాలను చూపించి మరో వైసీపీ నాయకుడూ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. తనపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించినా అతనిపై కేసు లేకుండా విడిచిపెట్టేశారు. బాధితురాలు స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఎస్సై సభ్యసమాజం విస్తుపోయేలా ప్రవర్తించారు. అత్యాచారం చిన్న విషయమంటూ తీసిపారేశారు. చివరికి ఎస్పీని ఆశ్రయిస్తే మొక్కుబడిగా ఒకరిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతల తీరు, పోలీసుల వ్యవహారంపై.. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ మండిపడ్డారు.
Gang Rape SC Woman: స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఒంటరి మహిళపై ఏడాదిగా ఆరుగురు అత్యాచారం
నంద్యాల జిల్లా అవుకు మండలం అన్నవరం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నాయకుడు జి. గోపాల్రెడ్డి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై దుస్తుల్లేకుండా ఆమె ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో అక్కడి నుంచి జారుకున్నాడు. గోపాలరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ ఎంపీటీసీ సభ్యుల సంఘానికి అధ్యక్షుడే కాక, అధికార పార్టీలో కీలక నాయకుడు కావటంతో పోలీసులు తొలుత కేసు నమోదు చేయలేదు. వ్యవహారం చర్చనీయాంశం కావడంతో నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టి మమా అనిపించారు.