YCP Leaders Scam in NREGA Orchards: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలకు.. సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాలనే సదుద్దేశంతో కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సొంత భూమి ఉన్న రైతులకు పండ్ల తోటలు పెంచుకునేందుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి ముందుకొచ్చే చిన్న, సన్నకారు రైతులకు.. భూమిలో గుంతలు తవ్వటం నుంచి మొక్క నాటి, నీరు పోసి పెంచే వరకు ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. ఎంపిక చేసిన మొక్కలు సైతం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా ఇస్తుంది. ఇందులో భాగంగా రైతులు మామిడి, బత్తాయి, జామ పంటలు సాగుచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకమే వైఎస్సార్సీపీ నాయకుల పాలిట కొంగు బంగారంలా మారింది.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కొత్తపల్లిలోని ఓ వైసీపీ నాయకుడు సర్వే నెంబరు 101-1Bలోని 4.9 ఎకరాల్లో జామ సాగు చేయడానికి దరఖాస్తు చేసుకోగా ఉపాధి హామీ పథకం నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు పొలంలో గుంతలు తీయడానికి, మొక్కల కొనుగోలు, నీళ్లు పట్టడానికి 77 వేలు మంజూరు చేశారు. అయితే సదరు సర్వే నెంబరులో జామ తోట సాగు చేయడం లేదు. అక్కడ బీర తోట సాగులో ఉంది. కొత్తపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తన బంధువుల పేరిట పండ్ల తోటలు మంజూరు చేసుకుని నిధులు కాజేశారు.
ఓ మహిళ పేరుతో సర్వే నెంబర్లు 43, 143, 144లో.. 10 లక్షల అంచనాతో జామతోట మంజూరు చేయించుకున్నారు. ఇప్పటివరకు 70 వేలు డ్రా చేసుకున్నారు. మరికొన్ని సర్వే నెంబర్లలోనూ తోటలు కనిపించడం లేదు. పండ్ల తోటలు సాగు చేసినట్లు రికార్డుల్లో చూపి భారీగా ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారు. వైసీపీ నాయకులు, కొందరు అధికారులు కలిసి లక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. కొత్తపల్లి, గొందిరెడ్డిపల్లి, గాండ్లపర్తి, బండమీదపల్లి, రాప్తాడు పంచాయతీల పరిధిలో జామ, మామిడి, చీనీ తోటలు సాగు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వీటికి వేలల్లో బిల్లులు కూడా మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. 80 శాతం సర్వే నెంబర్లలో అసలు తోటలే సాగు చేయలేదు. ఇదే రీతిన గత మూడు సంవత్సరాల నుంచి కోట్లల్లో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.