YSRCP Leaders Resigns :అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులతో వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగ రేగింది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు ఎవరో కొత్తవారిని తీసుకువచ్చి సమన్వయకర్తలు అంటే సరేనంటూ తలలు ఊపేయాలా అంటూ నేతలు తమ కేడర్‌తో నిర్వహించిన అంతర్గత భేటీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు తమ వర్గీయులతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టించి నిరసన వ్యక్తం చేయిస్తున్నారు. మరికొందరి వర్గీయులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
CM Jagan Changed Constituency Incharge :నియోజకవర్గాల మార్పు, టికెట్ నిరాకరణ సెగ జగన్‌కు తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు MLAలు కాకినాడలో బుధవారం నిర్వహరించిన సభకు మొహం చాటేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇద్దరూ కాకినాడలో జరిగిన సభకు దూరంగా ఉన్నారు. చంటిబాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయారని, చిట్టిబాబు స్థానికంగా ఉన్నా బయటకు రాలేదని తెలిసింది. ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలు పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు మాత్రం కాకినాడ వెళ్లి సీఎంను కలిశారు.
కాకినాడ జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ - ఇద్దరు ఎంపీపీలు రాజీనామా
Internal Clashes Between YSRCP Leaders :అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. మాధవికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతునిచ్చేదే లేదని స్పష్టం చేస్తున్నారు. హుకుంపేట ZPTC, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా మాధవి నియామకాన్ని నిరసిస్తూ అరకు ఎంపీపీ ఉషారాణి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్తి : విజయవాడ పశ్చిమలో కాదని విజయవాడ సెంట్రల్‌కు మార్చడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. బుధవారం ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని తన వర్గీయులతో టికెట్ మార్పుపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు టికెట్ లేకుండా పోయిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మద్దతుగా ఆయన వర్గీయులు, కొందరు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కో ఆప్షన్ సభ్యుడొకరు రాజీనామా చేశారు.