ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త దాడి.. అదే కారణమా ? - తెదేపా సర్పంచ్​పై వైకాపా నేత దాడి న్యూస్

అనంతపురం జిల్లా బహ్మసముద్రం మండలం ఎస్. కొండాపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా సర్పంచ్​పై వైకాపా నాయకుడు దాడికి పాల్పడ్డారు. నాటుకోళ్ల విషయమై తలెత్తిన వివాదంలో దాడి జరిగినట్లు బాధితులు వెల్లడించారు.

తెదేపా సర్పంచ్​పై వైకాపా నేత దాడి
తెదేపా సర్పంచ్​పై వైకాపా నేత దాడి

By

Published : May 4, 2022, 6:03 AM IST

తెదేపా మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త దాడి చేసి విచక్షణరహితంగా కొట్టాడు. అంతు చూస్తామని బెదిరింపునకు దిగాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌.కోనాపురం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త బాబు, ఆయన తల్లి చెన్నమల్లక్క, గ్రామ వాలంటీరు నారాయణతో కలిసి తెదేపా మద్దతుదారులైన సర్పంచి వనిత, ఆమెకు సమీప బంధువైన హనుమంతు, ఇతర కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. గతంలో హనుమంతుకు సంబంధించిన నాటుకోడిని బాబు దొంగలించాడని పోలీసు స్టేషన్‌ వరకు ఫిర్యాదు వెళ్లింది. పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు. ఇదే విషయమై మంగళవారం హనుమంతు, బాబుల మధ్య గొడవ జరిగింది. బాబు విచక్షణ కోల్పోయి హనుమంతు, ఆయన భార్య రత్నమ్మ, కూతురు జానకిపై దాడి చేస్తుండగా పక్కింట్లోనే ఉన్న సర్పంచి వనిత, ఆమె అక్క మహాదేవి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో తనను కాలితో తన్నడంతోపాటు కర్రతో కొట్టాడని, ఏడాది వయసున్న తన కూతురుపైనా దాడి చేశాడని, కత్తి తీసుకుని అంతు చూస్తామని బెదిరించాడని సర్పంచి వనిత వివరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సర్పంచి, ఇతర కుటుంబ సభ్యులు అక్కడి ఔట్‌పోస్టులో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబుపై గతంలో రౌడీషీట్‌ ఉందని, రెండు, మూడు కేసుల్లో నిందితుడని ఎస్సై పరుశురాముడు తెలిపారు. ఇరువర్గాలు దెబ్బలతో కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చేరినట్లు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. దాడులకు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వర నాయుడు ఫోన్‌లో బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. బ్రహ్మసముద్రం మండల పార్టీ కన్వీనర్‌ శ్రీరాములు, పట్టణ నేతలు మురళి, సత్యప్ప, రామరాజు, తదితరులు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి: పరీక్షకు ముందే పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్...ఆ తర్వాత వాట్సాప్ డిలీట్...

ABOUT THE AUTHOR

...view details