ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల్‌ జీవన్‌ మిషన్ పథకానికి నిధులివ్వరు - ప్రజలకి నీళ్లు అందవు - ఇలా అయితే ఎలా జగనన్నా! - no drinking water in ap

YSRCP Government Negligence on Jal Jeevan Mission Scheme in AP: గంగను భువికి తెచ్చేందుకు ఆనాడు భగీరథ ప్రయత్నేమే చేశారు. కానీ భగీరథ ప్రయత్నం వద్దు చేయి కలపండి ఇంటింటికీ నిళ్లందిస్తామని కేంద్రం చెబుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం మొద్దునిద్రవీడటం లేదు. "తాను పెట్టదు ఎవర్నీ పెట్టనివ్వదు" అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిధిలిస్తున్నా రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రక్షిత నీరు దొరక్క ప్రజల గొంతు ఎండిపోతోంది. పక్కనున్న తెలంగాణలో ఇంటింటికీ వందశాతం కుళాయిలతో నీళ్లందిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఇంటింటికి నీళ్లిస్తామని చెప్పిన సీఎం జగన్‌ ప్రజలకు వరాలిచ్చి నిధులివ్వకపోతే రక్షిత నీటి సరఫరా సాధ్యమేనా? ఇది ప్రజల్ని మోసగించడం కాదా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

YSRCP_Government_Negligence_on_Jal_Jeevan_Mission_Scheme
YSRCP_Government_Negligence_on_Jal_Jeevan_Mission_Scheme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 10:55 AM IST

జల్‌ జీవన్‌ మిషన్ పథకానికి నిధులివ్వరు - ప్రజలకి నీళ్లు అందవు - ఇలా అయితే ఎలా జగనన్నా!

YSRCP Government Negligence on Jal Jeevan Mission Scheme : "గ్రామాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. వాటర్‌గ్రిడ్‌ పనులు మూడు దశల్లో పూర్తి చేయాలి. మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో, రెండో దశలో విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాలి." 2019 ఆగస్టు 30న గ్రామీణ తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.

Jal Jeevan Mission Scheme in AP :కానీ వాస్తవం మాత్రం వేరు గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా నిధులను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఉపయోగించుకోలేదని జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ రాజ్యసభలో చెప్పారు.

"జల్‌జీవన్‌ మిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు చాలా అధమంగా ఉంది. 2021 తర్వాత కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌లో కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్‌ వాడుకోలేదని అత్యంత దుఃఖంతో చెబుతున్నా. 2021-22లో రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వలేకపోయారు. కచ్చితంగా చింతించాల్సిన పరిస్థితి. నిరంతరం వారితో సంప్రదింపులు జరిపి పురోగతి సాధించేలా చర్యలు చేపడతాం."- గజేంద్ర షెకావత్‌, జల్‌శక్తి మంత్రి

ప్రజల దాహార్తి తీర్చడంలో జగన్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి కేంద్ర మంత్రి మాటాలే నిదర్శనం.

Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ విఫలం: గజేంద్ర షెకావత్​

దేశంలోనే అగ్రస్థానం- మనం మాత్రం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టేజలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా 26వేల 769కోట్ల 82లక్షల రూపాయల వ్యయంతో 2024 మార్చికి మొత్తం 64లక్షల 79వేల 598 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం వాటా భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా ఇప్పటివరకు గత నాలుగేళ్లలో 38 లక్షల 63వేల 776 ఇళ్లకే కుళాయి కనక్షన్లు ఇచ్చారు. 26లక్షల 15వేల 822 ఇళ్లకు ఇంకా కనెక్షన్లు ఇవ్వాలి. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు, ఇంకో 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇళ్లకు 100శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.

పట్టాలెక్కని వాటర్‌ గ్రిడ్‌ పనులు : ఇళ్లకు వంద శాతం కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలు ఒక ప్రణాళిక ప్రకారం తొలుత జలాశయాల్లోని నీటిని గ్రామాలకు అందుబాటులోకి తెచ్చాయి. ఈలోపుతాగునీటి పథకాల నిల్వ సామర్థ్యం పెంచి, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు నిర్మించాయి. ఫలితంగా ఇంటింటికీ నీళ్లందుతున్నాయి. రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ముందు చేయాల్సిన పనులు వెనక్కి, చివర్లో చేయాల్సిన పనులు ముందు చేస్తున్నారు. ఆరు జిల్లాల్లో ప్రతిపాదించిన వాటర్‌ గ్రిడ్‌ పనులు ఇంకా పట్టాలెక్కలేదు. సర్వే పేరుతో ఏడాది క్రితం వరకు కాలయాపన చేశారు. కేంద్రం ఒత్తిడి చేస్తోందని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. వాటర్‌గ్రిడ్‌ పనులు పూర్తిచేయకపోవడం, రక్షిత నీటి పథకాల నిల్వ సామర్థ్యం పెంచకపోవడం వల్ల కుళాయిల్లో నుంచి చాలాచోట్ల నీళ్లే రావట్లేదు.

జల్ జీవన్ మిషన్​కు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నిధులు కేటాయించని ప్రభుత్వం : జల జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు కేటాయించని కారణంగా పనులకు టెండర్లు వేయాలంటేనే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. పనులు చేసి బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరిగిన గుత్తేదారులు టెండర్లు వేసేందుకు వెనకడుగు వేస్తుండటంతో ఇంటర్నల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి 2,250 కోట్ల రూపాయల విలువైన 21,960 పనులను సామాజిక కాంట్రాక్టింగ్‌ విధానంలో స్వయం సహాయక సంఘాలకు దశల వారీగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అధికార పార్టీ ముఖ్య నాయకులకు ఎన్నికల ముందు పనులు కేటాయించేందుకు కొత్త విధానం తేస్తోందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.

నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం : జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జాప్యం పనులపై ప్రభావం చూపుతోంది. కేంద్రం ఆమోదించిన పనులు పూర్తి చేయడంలో దేశంలో తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌ ముందున్నాయి. ఏపీ మాత్రం తమిళనాడు, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్‌ కంటే వెనుకబడింది. కేంద్రం గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంరెండున్నర నెలల్లో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధుల కింద 793కోట్ల 57 లక్షల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయీ ఇవ్వలేదు. సామాజిక కాంట్రాక్టరింగ్‌ విధానంలో పనులైతే భారీగా కేటాయించబోతున్నారు.

నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూపులు :సీఎం జగన్‌ సొంత జిల్లా YSR కడపలో 3లక్షల 69వేల 375 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 99 శాతానిపైగా కనెక్షన్లు జారీ చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కొత్త కుళాయి కనెక్షన్ల సంఖ్యను భారీగా చూపేందుకు ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ నీళ్ల సరఫరాపై కనబరచడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, సత్యవేడు, పుంగనూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ అనేక గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చినా నీరు సరఫరా కావడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కుళాయి కనెక్షన్లు ఇచ్చి నెలలైనా నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ పైపుల ద్వారా రక్షిత నీటిని ఇస్తామని ఎంతో గొప్పగా మాటలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ ఇందుకు సంబంధించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుని అటకెక్కించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 8వేల 600 కోట్లతో ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయించారు. అయితే ఉద్దానం, డోన్, పులివెందులకే ప్రాజెక్టుని పరిమితం చేశారు.

Funds To AP Under Jal Jeevan Mission: జల్‌ జీవన్‌ మిషన్‌లో ఏపీ రూ.3 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details