YSRCP Government Negligence on Drought Mandals :రాష్ట్రంలో రైతులు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవ గణాంకాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఖరీఫ్‌లో కరవు మండలాలు 400 పైనే ఉంటాయి. అధికారులు మాత్రం 103 కరవు మండలాల్నే ప్రకటించి సరిపెట్టారు. కరవును గుర్తించే అన్ని అంశాల ప్రకారం చూసినా దుర్భిక్ష పరిస్థితులున్నాయి. అయినా సీఎం జగన్ మాటలకు అనుగుణంగా కొద్దిపాటి కరవునే చూపాలంటే గణాంకాల్లో తిరకాసు చేయక తప్పదు. అలాచేస్తే ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే అవుతుందనే అభిప్రాయాలు వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఖరీఫ్ ముగిసి నెలన్నర దాటినా ఇప్పటికీ కరవు లెక్కలు బయట పెట్టలేదు. కేంద్రానికి నివేదికల్ని పంపలేదు.
Drought Zones in AP :ప్రభుత్వాలెన్నో మారాయి. ఎప్పుడూ వాస్తవ గణాంకాల ఆధారంగానే కరవు మండలాల్ని ప్రకటిస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోదు. అయితే సీఎం స్థాయి వ్యక్తే కరవు గురించి పట్టించుకోక పోవడాన్ని, అధికారులు తమ బాధ్యతను విస్మరించి పని చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 2021-22, 2022-23లోనూ కరవు పరిస్థితులున్నా కావాలనే దాటవేశారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?
YCP Govt Manipulations on Drought Hit Mandals :వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయాలంటే.. కొన్ని దశాబ్దాల వర్షపాతం, ఉష్ణోగ్రతలు, సాగు, కరవు తీవ్రత తదితరాల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యధిక, అత్యల్ప వర్షపాతం, ఉష్ణోగ్రతలు తెలియాలంటే పాత రికార్డులే ఆధారం. అలాంటి వాటిని ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసిన వారవుతారు. ఆ సంగతిని అధికారులు గుర్తెరగాలి అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సాధారణం కంటే 31.5%తక్కువవర్షపాతం నమోదైంది. ఆగస్టులో 55% తక్కువ వానలు కురిశాయి. గత 50 ఏళ్లలో ఇంతటి తీవ్ర వర్షాభావం లేదు.
వాస్తవాలకు పాతర.. అబద్ధాల జాతర :70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబరులో 90% తక్కువ వానలు కురిశాయి. సుమారు 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు. ఇవన్నీ వాస్తవాలే అయినా అధికారులు ఎక్కడా నోరు మెదపడం లేదు. సాగు తగ్గిందంటే వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఉలిక్కిపడుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ పెద్దల నుంచి ఆగ్రహం ఎదురవుతుందో అనే భయంతో అంతా బాగుందంటూ ప్రకటనలు ఇస్తున్నాయి.