Young Mechanic Agriculture Implement Innovation: ఆ యువకుడు తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్నాడు. అయితేనేం వ్యవసాయంలో తండ్రికి అండగా నిలిచి కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన ఈ యువకుడు తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఓ పరికరాన్ని కనిపెట్టాడు. దుక్కి దున్నే సమయంలో ట్రాక్టర్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని తయారుచేశాడీ యువ మెకానిక్. ఈ యువకుడి పేరు విష్ణువర్ధన్. అనంతపురం జిల్లా గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామం ఇతని స్వస్థలం. కుటుంబ ఆర్థిక కారణాలతో తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపేసి పని బాట పట్టాడు. ఊర్లో వాళ్లతో కలిసి గుత్తికి వెళ్లి మెకానిక్‌గా పనికి కుదిరాడు. ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాడు విష్ణువర్ధన్. ఆ పనిలోనే ఏదైనా కొత్తగా చేయాలనే కలలు కనేవాడు.
తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు - యంగ్ మెకానిక్ యువ స్టోరీ
YOUNG MECHANIC: ఎంత చదివామనేది కాదు.. ఆ చదువు మనకెంత సంస్కారాన్ని, బాధ్యతను నేర్పిందనేది ముఖ్యం. ఆ యువకుడి విషయంలో అదే జరిగింది. తండ్రి వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అతన్ని తొలిచేశాయి. దానికి ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలని కల కన్నాడు. అనుకున్నట్టుగానే ఓ పరికరాన్ని తయారుచేసి తండ్రికి కానుకగా అందించి, తండ్రి కళ్లలో ఆనందానికి కారణమయ్యాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు.. ? ఏం చేశాడనే సందేహం కలగుతుందా..? లేటెందుకు మరీ.. మీరూ తెలుసుకోండి.
అదే సమయంలో వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడులు అవడం, అందులో ట్రాక్టర్‌కే ఎక్కువగా అవడం, పంట చేతికందకపోతే ఇక అంతే సంగతులు అని తండ్రి దిగులును చూసి విష్ణు కాస్త బాధగా ఉండేవాడు. అప్పుడే ఓ వ్యక్తి 12 వేల రూపాయలకు బైక్ అమ్ముతానంటూ వచ్చాడు. ఇదే మంచి అవకాశంగా భావించి ఆ బండిని కొనుక్కున్నాడు. దానికి మరో 12 వేలు జతచేసి పల్సర్ బండికి నాగళ్లను అమర్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తమతో తిరిగిన వ్యక్తి రైతులకు ఉపయోగపడే మంచి పరికరాన్ని ఆవిష్కరించడం గొప్పగా అనిపిస్తోంది అంటున్నారు అతడి మిత్రులు. కుటుంబ బాధ్యత గుర్తెరిగి కష్టాలలో నుంచి గట్టెక్కడానికి నైపుణ్యాలను వాడుకోవడం హర్షించదగిన విషయం అంటున్నారు.
మెకానిక్‌గా తన నైపుణ్యాన్ని ఉపయోగించి నాగళ్లను మోటర్ బైక్‌కు అనుసంధానం చేసేలా తయారు చేయించాడు. ఇంకేముంది ఆ పరికరం ట్రాక్టర్ తరహాలో భూమి దున్నుతుంది, కలుపుతీస్తుంది. తన కష్టం చూడలేక కుమారుడు ఈ యంత్రాన్ని తయారు చేయడం పట్ల తండ్రి అమితానందాన్ని పొందుతున్నాడు. గతంలో ట్రాక్టర్‌తో పని చేసినప్పుడు ఎకరాకు దాదాపుగా వేయి రూపాయలు ఖర్చయ్యేది. కానీ, ఈ యంత్రం వల్ల చాలా తగ్గి కేవలం 3వందల రూపాయల్లో ఎకరం దున్నకం అయిపోతుందని చెబుతున్నాడు విష్ణు. కేవలం 3లీటర్ల పెట్రోల్‌తో ఎకరా పొలం దున్నేయగలదంటున్నాడు. ఈ యంత్రం పనితీరును పరిశీలించిన రైతులు తమకూ తయారు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీటిని తయారు చేయటానికి అవసరమైన ఆర్థిక పెట్టుబడి సహాయం అందించటానికి ఎవరైనా ముందుకు వస్తే, రైతులందరికీ చౌకగానే పరికరం తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడా యువకుడు. రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ పరికరాన్ని రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు విష్ణువర్ధన్.