అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్ద తండాకు చెందిన తెదేపా మద్దతుదారు కృష్ణానాయక్ సర్పంచి స్థానానికి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవటం వివాదంగా మారింది. ఈ తండా సర్పంచి స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా కళావతమ్మ, హనుమంతునాయక్, కృష్ణనాయక్లు అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీప్రియ తెలిపారు. దీంతో మిగిలిన రవీంద్ర నాయక్ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. అయితే కృష్ణనాయక్ భార్య రమణమ్మ తన భర్తను అధికార పార్టీ నాయకులు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసి అపహరించారిని ఆరోపిస్తూ రాత్రి 10 గంటల సమయంలో సీఐ మధుకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆచూకీ తెలపాలని కోరారు.
విషయం తెలుసుకున్న కదిరి తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్, న్యాయవాది గంగిరెడ్డి, తెదేపా నాయకులు సంఘటానా స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడారు. కృష్ణానాయక్ను కుటుంబసభ్యులకు అప్పగించాలని కోరారు. వైకాపా నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
స్టేషన్లో ప్రత్యక్షం
కృష్ణనాయక్ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు అపహరణకు గురయ్యాడని భావిస్తున్న కృష్ణానాయక్ను పోలీసులు అర్థరాత్రి గాండ్లపెంట పోలీస్ స్టేషన్లో హాజరుపరిచారు. తాను స్వచ్ఛందంగానే నామినేషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. తనను ఎవరూ అపహరించలేదనీ.. తాను ఎన్పీకుంట మండలం ధనియానిచెరువు గ్రామంలోని తన అల్లుడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. దీంతో అతడిని ఎస్సై, ఆర్ఐ సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించారు.
కర్నూలు జిల్లాలో
మొదటి విడత ఎన్నికలకు సంబంధించి గురువారంతో ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు అధికార పార్టీ నేతల నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి.
మిట్నాల నామినేషన్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులను.. వైకాపా నాయకుడు బెదిరించారు. బలవంతంగా మిట్నాల నామినేషన్ కేంద్రం వద్దకు తీసుకువెళ్లి.. నామినేషన్ ఉపసంహరింపజేసినట్లు సమాచారం అందటంతో, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు మాత్రం వారు స్వచ్ఛందంగానే విత్డ్రా చేసుకున్నట్లు తెలిపారు. తమను వైకాపా నాయకులు బలవంతంగా తీసుకువెళ్లి నామినేషన్లు విత్డ్రా చేయించారని.. వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు ప్రయత్నించిన లక్ష్మీ దేవి గ్రామానికి చేరుకున్నాక చెప్పారు.
ప్రాణహాని ఉందని ఎస్‌ఈసీకి ఫిర్యాదు
నంద్యాల మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన సర్పంచి అభ్యర్థి అన్నపురెడ్డి సుబ్బమ్మ.. తనకు వైకాపా నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం తమ వర్గానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులను.. వైకాపా నాయకులు బలవంతంగా ఎత్తుకెళ్లి పత్రాలను ఉపసంహరించారని తెలిపారు. ఎత్తుకెళ్లే సమయంలో సర్పంచి అభ్యర్థి గురువారం నామపత్రాన్ని ఉపసంహరించుకోకపోతే చంపుతామంటూ కేకలు వేశారని.. ఆమె ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
అన్నపురెడ్డి సుబ్బమ్మ రాసిన లేఖ కమిషన్ విచారణ చేపట్టి నివేదిక పంపాలని తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం వచ్చినట్లు సుబ్బమ్మ తెలిపారు. ఉపతహసీల్దార్ రమాదేవి బ్రహ్మణపల్లె గ్రామానికి వచ్చి తనను, ఇద్దరు వార్డు సభ్యులను విచారించినట్లు వివరించారు. బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీసుకెళ్లారు. ప్యాపిలి బూరుగుల ఏకగ్రీవానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిసి వివరించారు.
నేరుగానే హెచ్చరికలు:
బెదిరింపు కాల్స్ రికార్డు చేస్తుండటంతో అధికార పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాలంటీర్లు, గ్రామ నాయకులను నామినేషన్లు వేసిన వార్డు, సర్పంచి అభ్యర్థుల.. ఇళ్లకు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు తొలిగిస్తామని హెచ్చరిస్తున్నారు. తర్వాత మీకు ఏవీ రావని నేరుగానే చెబుతున్నారు.
ఇదీ చదవండి:పల్లె పోరు: నేటితో ముగియనున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ