District Level Convenors Meeting : పార్టీ తమను వాడుకొని వదిలేసిందని కొందరు, చేసిన పనులకు బిల్లులు చెల్లించటంలేదని మరికొందరు, సచివాలయ వాలంటీర్లుగా చదువురాని వారిని నియమించారంటూ జగనన్న సచివాలయ కోఆర్డినేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలో జిల్లా స్థాయి కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉష శ్రీచరణ్‌తో పాటు ఆరు నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
సమావేశానికి వచ్చిన కో ఆర్డినేటర్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీ తరపున బూత్ లెవెల్ కో ఆర్డినేటర్లను నియమించి, వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. తమను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు మళ్లీ సచివాలయ స్థాయి జగనన్న కో ఆర్డినేటర్లను నియమిస్తున్నారని.. తమ పరిస్థితి అలా కాకుండా చూడాలని కోరారు. మరో వైసీపీ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ చేసిన పనులకు బిల్లులు రాక అల్లాడిపోతున్నామని.. సకాలంలో చెల్లింపులు జరిగితే గ్రామాల్లో మరింత అభివృద్ధి చేయటానికి వీలవుతుందని చెప్పారు.