ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP Leaders Attack on TDP: తాడిపత్రిలో వైఎస్సార్​సీపీ నేతల వీరంగం.. టీడీపీ నేతలపై రెండు సార్లు దాడి - ఏపీ ముఖ్య వార్తలు

YCP Leaders Attack on TDP Activists in Tadipatri: రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నాయకులు దాష్టికాలు ఎక్కువయ్యాయి. ప్రశ్నిస్తే దాడులు అన్నట్లు తయారవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణ పరిస్థితి గురించి టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్​సీపీ వాళ్లు.. దారి కాచి టీడీపీ నేతలపై రెండు సార్లు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి.

YCP Leaders Attack on TDP Activists in Tadipatri
YCP Leaders Attack on TDP Activists in Tadipatri

By

Published : Jul 12, 2023, 11:32 AM IST

YCP Leaders Attack on TDP Activists in Tadipatri: ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం, అక్రమాలను అడ్డుకుంటే హత్యలు చేయడం వైఎస్సార్​సీపీ నాయకులకు పరిపాటి అయిపోయింది. తాజాగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్​సీపీ నాయకులు రెచ్చిపోయారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో మంగళవారం రాత్రి వైఎస్సార్​సీపీ నాయకులు.. టీడీపీ నాయకులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గన్నెవారిపల్లి కాలనీలో పనులు చేసినా రెండు సంవత్సరాలుగా బిల్లులు రావడం లేదని, చేస్తున్న పనులను వైఎస్సార్​సీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, అధికారులతో మధ్యవర్తిత్వం చేయిస్తూ వైఎస్సార్​సీపీలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారని.. మంగళవారం(జులై 11) మధ్యాహ్నం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తమపై దాడులు చేశారని వారు ఆరోపిస్తున్నారు. మొదట రాత్రి 10.30 గంటల సమయంలో కడప రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్త గోపాల్​పై కొంత మంది అధికార పార్టీ నాయకులు కర్రలతో దాడి చేశారు. గమనించిన కార్యకర్తలు.. పోలీసులకు సమాచారం ఇచ్చి అతడిని తాడిపత్రి వైద్య విధాన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, మరికొందరు కలిసి దాడిలో గాయపడిన గోపాల్​ను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆసుపత్రిలో కరెంటు ఆపేసి మరీ.. :ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల తర్వాత మళ్లీ ద్విచక్రవాహనాలపై సుమారు 15 మందికి పైగా వైఎస్సార్​సీపీ నాయకులు కర్రలు, కత్తులతో ఆసుపత్రికి వచ్చి కరెంటు సరఫరా నిలిపి వేసి టీడీపీ వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చింబిలి వెంకటరమణ, అమీర్, రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. గోపాల్, అమీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై వెంకటరమణ మాట్లాడుతూ.. గన్నెవారి పల్లి కాలనీలో ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు, వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నించినందుకు తనను, తన అనుచరులను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్​సీపీ నాయకులు దాడులు చేశారన్నారు. గన్నెవారిపల్లి కాలనీ ఎంపీటీసీ సభ్యుడు రవికుమార్, వీరాంజనేయులు, వినయ్​, మరో 12 మంది దాడులకు పాల్పడిన వారిలో ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తమపై కూడా దాడి చేశారంటూ ముగ్గురు వైఎస్సార్​సీపీ నాయకులు ఆసుపత్రిలో చేరారు.

వైసీపీలో చేరాలంటూ అధికారులే ఒత్తిడి: అధికారులే మధ్యవర్తులుగా మారి టీడీపీ నాయకులను వైఎస్సార్​సీపీలోకి చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని గన్నెవారిపల్లి సర్పంచి మహేష్ ఆరోపించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో మంగళవారం(జులై 11) మధ్యాహ్నం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని.. అదే అధికార పార్టీ నాయకులు చేసిన పనులకు మాత్రం వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరేందుకు మండల పరిషత్తు కార్యాలయానికి వస్తే.. వైఎస్సార్​సీపీలోకి చేరితే 30 లక్షల రూపాయలు ఇప్పిస్తామని ఈఓఆర్డీ ఒత్తిడి చేస్తున్నారన్నారు. అందుకు ఒప్పుకోకపోవడంతో రెండు సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వకపోగా.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూడా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు అధికారులు ఉన్నారా.. లేకుంటే రాజకీయం చేసేందుకు ఉన్నారా అంటూ ఎంపీటీసీ సభ్యుడు రవిశంకర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

భూపంపకాల్లో గొడవ.. కత్తితో అన్న కుమారుడిపై దాడి: కుటుంబ కలహాలు, భూ వివాదాల కారణంగా అన్న కుమారుడిపై చిన్నాన్న దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. నాలుగో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రాజగోపాల్ నాయుడు (వెంకట్రావ్​నగర్), అతని చిన్నాన్న చంద్రశేఖర్ నాయుడు (మారుతి నగర్) కొంతకాలంగా అనంతపురంలో ఉంటున్నారు. వీరి మధ్య సొంతూరిలోని భూ పంపకాల విషయంలో వివాదం ఉంది. ఇప్పటికే పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలో రాజగోపాల్ నాయుడు స్థానిక రాంనగర్ వంతెన కింద గణేష్ హోటల్ సమీపంలో ఉండగా అతని చిన్నాన్న అక్కడికి వచ్చి మరోమారు ఘర్షణకు దిగారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ నాయుడు.. కత్తితో రాజగోపాల్​ నాయుడు వీపు, పొట్టలో పొడిచాడు. అప్రమత్తమైన స్థానికులు దాడిని అడ్డుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలిం చారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీ కాసులు క్షతగాత్రుని నుంచి వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details