Kamarupalli Beneficiaries fire on Cm jagan: ప్రభుత్వమే జాగాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తోంది అనగానే.. సంబరపడ్డామని ఆ నిరుపేదలు చెబుతున్నారు. అప్పులు తెచ్చి మరీ ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు. తీరా పునాదులు తీశాక.. అసలు విషయం తెలిసిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణానికి పనికిరాని భూముల్ని కేటాయించి.. జగన్ ప్రభుత్వం తమను మోసం చేసిందని లబోదిబోమంటున్నారు.
జగనన్న కాలనీల ద్వారా 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు అందిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇంటి నిర్మాణాలకు సంబంధించి పలుచోట్ల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం పనికిరాని భూములిచ్చి ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా కామారుపల్లి జగనన్నకాలనీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం రెండు అడుగుల మేర పునాదులు తీసినా నీరు వస్తోందని, ఇలాంటి నేలలో ఇళ్లు ఎలా కట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
కామారుపల్లిలో 160 ఎకరాల భూమిలో జగనన్న కాలనీ పేరిట 2021 జనవరి 3న 7 వేల300 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన గుత్తేదారులకు పనుల రూపంలో కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకే.. స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. పనికి రాని భూమిని జగనన్నకాలనీకి ఎంపిక చేశారని మండిపడుతున్నారు. హడావిడిగా బోర్లు, గ్రావెల్ రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. నిర్మాణాలు చేపట్టకుంటే పట్టాలు రద్దుచేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.