Ananthapuram Municipal Corporation : అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. అధికార వైసీపీ పార్టీ సభ్యులే విపక్ష సభ్యులుగా మారి సమస్యలపై తమ గళం వినిపించారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ నిరసన చేపట్టారు. అనంతపురంలోని సెంట్రల్ పార్క్ స్థలం అన్యాక్రాంతం అవుతోందంటూ కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని 7వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ నాగమణి నిరసన తెలిపారు. దీంతో సమావేశంలోని తోటి కార్పొరేటర్లు ఆమెకు మద్దతు తెలిపారు.
తాము టీ లు, బిస్కెట్లు తాగడానికి వచ్చామా..! తీర్మానాలు, పరిష్కారాలు లేని సమావేశాలు ఎందుకంటూ.. పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సొంత పార్టీ కార్పొరేటర్లను సర్ది చెప్పేందుకు మేయర్ వసీం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆయనే స్వయంగా వచ్చి నేలపై కూర్చున్న కార్పొరేటర్లను శాంతింపజేసే తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది అధికారులు ముడుపులు చెల్లిస్తే గాని పనులు చేయడం లేదంటూ కార్పొరేటర్లు ఆరోపించారు. అధికారుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.