తెదేపా నాయకుడి ఇంటిచుట్టూ.. బండలు పాతిన వైకాపా వర్గీయులు - fight between ycp and tdp activists in venkatapuram
అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నాయకుల ఇళ్ల చుట్టూ వైకాపా మద్దతుదారులు బండలు పాతారు. వాటిని తొలగించేందుకు తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు నాగరాజు, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. ఈ విషయమై గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా.. పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తమ పార్టీ నాయకుడి స్థలం కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని... బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.