YSRCP Strict Action Against To Two Leaders in Anantapur: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కీలక నేతలపై సీరియస్ అయ్యింది. అంతేకాకుండా వారిలో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోకరికి షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించింది. పార్టీ వీరిపై ఇలాంటి చర్యలు తీసుకోవటానికి బలమైన కారణాలే ఉన్నాయి. సొంత పార్టీ నాయకుల పైనే భూ అక్రమాల ఆరోపణలు చేసినందుకు ఒకర్ని సస్పెండ్ చేయగా.. అవమానించారంటూ చేసిన వ్యాఖ్యలకు ఓ నాయకుడికి షోకాజ్ నోటీసులు అందించింది.
వైసీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సస్పెండ్: అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం మండిపడింది. ఉరవకొండ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైసీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో భూ అక్రమాలలో వైసీపీ నాయకులు ఉన్నారంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డిలపైనే ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ అయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తెలిపారు.