Worst Roads in Minister Usha Sricharan Constituency: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. రహదారుల నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే బ్యాంకులు నిధులిచ్చినా రోడ్లు బాగుపడటం లేదు. ప్రధాన రహదారి నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లే పంచాయతీరాజ్ రహదారులు అడుగుకో గుంత,గజానికో గొయ్యి తరహాలో ప్రజలకు నరకాన్ని చూపుతున్నాయి. కొన్నిచోట్ల ఆర్బాటంగా రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, శిలాఫలకాలు వేయించారు కానీ రోడ్డు మాత్రం నిర్మించలేదు. కుందుర్పి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఈటీవీ బృందానికి శిలాఫలకాలు ఘనంగా పెట్టి, రహదారిపై మాత్రం నాలుగేళ్ల క్రితం కంకరవేసి వదిలేసి పరిస్థితులు సాక్షాత్కరించాయి. కంకర వేసిన రహదారులపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పావుతున్న పరిస్థితి నెలకొంది. ఉష శ్రీచరణ్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు రోడ్డు కోసం పరిచిన కంకర, మంత్రి అయ్యాక కూడా బీటీ రోడ్డు వేయని దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ప్రజల అంచనాలు తలకిందులు... దేశంలో ఎక్కడైనా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల నియోజకవర్గాలు ఇతర ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల కంటే మౌలిక వసతుల పరంగా ఎంతో కొంత మెరుగ్గా ఉంటాయి. అయితే ప్రజలకు ఏదైనా మంచి చేయాలని భావించి, గ్రామీణులకు మౌలిక సదుపాయలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నవారి పరిస్థితి అది. కానీఅనంతపురం జిల్లా మంత్రి ఉష శ్రీచరణ్ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారులు ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉష శ్రీచరణ్‌కు మంత్రి పదవి వచ్చినపుడు నియోజకవర్గ ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తారని, అందరికంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయని భావించారు. కానీ ప్రజల అంచనాలు తలకిందులై గ్రామీణ రహదారులకు కనీసం అతుకులు కూడా వేయించలేని మంత్రి ఉష గురించి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.