అనంతపురంలోని రహదారులపై గోతులు వాహనదారుల ప్రాణాలు తీసేస్తున్నాయి. మూడేళ్లుగా రహదారులకు కనీస మరమ్మతులు చేయకపోవటంతో ఎక్కడికక్కడ పెద్దఎత్తున గుంతలు ఏర్పడి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వర్షాకాలం ముందు రహదారులకు మరమ్మతులు నిర్వహించేవారు. మూడేళ్లుగా ఆర్అండ్బీ అధికారులు రోడ్లపై గుంతలకు కనీస మరమ్మతులు కుడా చేయకపోవటంతో వర్షాలకు చిన్నపాటి గుంతలు పెద్ద గోతులుగా మారాయి. కదిరి నుంచి రాయచోటికి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. గోతులుగా మారిన రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని, వాహనాల రిపేర్లకే తమ సంపాదన ఖర్చవుతోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కదిరిలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. నిత్యం వివిధ జిల్లాల నుంచి కదిరి నర్సింహ్మ స్వామి ఆలయ దర్శనానికి, తిమ్మమ్మ మర్రిమాను చూడటానికి వస్తుంటారు. పర్యాటకుల కోసం అనంతపురం నుంచే కాకుండా కడప, చిత్తూరు జిల్లాల నుంచి దర్శనీయ స్థలాల పర్యటన కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. చాలా మంది పర్యాటకులు సొంత వాహనాల్లో కదిరికి వస్తుంటారు. వీరంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు తిరుగుతున్నా.. రోడ్లకు కనీస మరమ్మతులు చేయటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి నుంచి ఎన్పీ కుంట మార్గంలో రెండేళ్లలో 130 రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. తమ గ్రామాలకు చెందిన వారే 40 మంది మృతి చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.