Women protest: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మహిళలు నిరసనకు దిగారు. మెలకాల్మూరు రోడ్డు చెక్‌పోస్టు వద్ద ఖాళీ బిందెలతో బైఠాయించారు. సుమారు గంటపాటు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. 9 నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నా.. పురపాలక అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో.. మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేవరకూ కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం రాయదుర్గం మున్సిపల్ ఏఈ వీరేష్ అక్కడికి చేరుకుని మహిళలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నిసార్లు చెప్పినా సమస్య తీర్చడం లేదని.. ఏఈతో మహిళలు వాగ్వాదానికి దిగారు. కాలనీవాసులు, మహిళలు తాగునీరు నీరు సక్రమంగా సరఫరా చేయాలని ఏఈని డిమాండ్ చేశారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని.. అప్పటివరకూ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తామని.. ఏఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.