Women Empowerment Conference: అనంతపురం జిల్లా ప్రజలు మంచి ఆదరాభిమానాలు కలిగిన వారు అని.. మహిళల పాదాల చెంత స్వర్గం తప్పక ఉంటుందని రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఊడేగోళం గ్రామ సమీపంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయంలోని కళ్యాణమండపంలో శనివారం జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో హైకోర్టు జడ్జిలు జస్టిస్ శేష సాయి, జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ దోనడి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, అంగన్వాడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నెపోలియన్ కొటేషన్‌ను గుర్తు చేసుకున్నారు. 'మంచి తల్లులను ఇవ్వండి, మంచి దేశాలు ఇస్తారని' తెలియజేశారు. మహిళా సాధికారతపై ఇంకా చర్చించుకోవడం దురదృష్టకరం అని అన్నారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం చాలా గొప్పదని భగవద్గీత, ఖురాన్ లాంటిదని అన్నారు. మహిళలను గౌరవించడం ఇంటి నుంచి ప్రారంభం కావాలని తెలిపారు.
మంచి, చెడ్డ చెప్పే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జరగకుండా క్షేత్రస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంట్లో తమ పిల్లలకు మంచి, చెడు స్పర్శలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు పనిచేసే చోట వారికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, సంబంధిత యాజమాన్యాలదేనని అన్నారు. చాలామంది మహిళలు ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో హింసకు గురవుతున్నప్పటికీ బయటకి చెప్పుకోలేక పోతున్నారు అని అన్నారు. దేశంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా.. ప్రతి రెండు నిమిషాలకోసారి మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. అందుకు మనం సిగ్గుపడాలని అన్నారు. మహిళా ఖైదీలకు సైతం ప్రత్యేక వసతులు కల్పించాలని.. గర్భిణీ ఖైదీలకు పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య సంరక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సంరక్షణ చట్టంలో నిరాదరణకు గురైన బాలలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, దీర్ఘకాలిక రోగుల పిల్లలు, బాల్య వివాహాల బాధితుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భవిత తెలిపారు.