ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Women Disrimination: రాకెట్ల కాలంలోనూ రాతికాలపు ఆచారాలే

ఆడదంటే అబల కాదు.. సబల..! అవతార పురుషుడైనా అమ్మ కడుపు నుంచే పుట్టాలి...!! మగువా లోకానికి తెలుసా నీ విలువ.! అతివల గొప్పదనాన్ని తెలియచేసే ఇలాంటి సూక్తులేవీ ఆ ఊరి వారికి సుతరామూ గిట్టవు. ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా.. తాము మాత్రం పాతాళపు అగాధంలోనే జీవిస్తామంటారు ఆ గ్రామస్థులు. స్త్రీలల్లో అత్యంత సహజంగా జరిగే మార్పులనూ.. మకిలిగా చూసి.. వారిపై వివక్ష చూపుతున్న ఆ వింత గ్రామమేంటో..ఎక్కడ ఉందో తెలుసా...

Women Disrimination
రాకెట్ల కాలంలో.... రాతికాలపు ఆచారాలు

By

Published : Oct 13, 2021, 6:02 AM IST

రాకెట్ల కాలంలో.... రాతికాలపు ఆచారాలు

జిజి హట్టి....అనంతపురం జిల్లా రోళ్ల మండలంలోని ఓ చిన్న గ్రామం. ఆ ఊర్లో సుమారు 150 గడపలుంటాయి. ఆ జనాభాలో సగం మంది ఆడవాళ్లే. అయినప్పటికా పాతకాలం నాటి ఆచారాలను ఈ ఆధునిక యుగంలోనూ ఇంకా పాటిస్తున్నారు. మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు..ఆ గ్రామస్థులు. నెలసరి సమయంలో, బాలింతగా ఉన్నప్పుడు ఆ ఊరి మహిళల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బాగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ సమయంలో వారినసలు ఇంట్లోనే ఉండనివ్వరు. ప్రతి నెలా రుతుక్రమంలో 3 రోజుల పాటు ఊరి బయట నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ఉండాల్సిందే.

"నెలసరి సమయంలో ఊరి బయటనే ఉండాలి. వాళ్లు పెట్టిందే తినాలి. ఏమీ ముట్టుకోకూడదు. ఇలాంటివి పాటించడం కష్టంగానే ఉంటుంది కానీ మన మంచికే అని పాటిస్తున్నాం.. ఇది మా ఊరి ఆచారం." -గ్రామస్థురాలు

ప్రతీ మహిళ జీవితంలో అమ్మ అవడం అనేది ఓ వరం. బిడ్డకు జన్మనివ్వటంతోనే...ఆడతనం...అమ్మతనం అవుతుందంటారు. వారి జీవితాల్లోనే ఎంతో మధురమైన అనుభూతిగా అందరూ భావిస్తారు.తల్లిబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాలి..సంరక్షించాలి. కానీ జిజి హట్టిలో మాత్రం..బిడ్డను ప్రసవించాక.. 2-3 నెలల పాటు తల్లీబిడ్డను ఇంట్లోకి రానివ్వరు. ఇంటి బయట ఓ గుడిసె ఏర్పాటు చేసి..పసిబిడ్డతో సహా అక్కడే ఉంచుతారు. వానలొచ్చినా, వరదలొచ్చినా అందులోనే ఉండాల్సిన దుస్థితి.

"ప్రసవం అయ్యాక బిడ్డతో సహా మూడు నెలల పాటు ఇంటి బయట ఏర్పాటు చేసిన గుడిసెలోనే ఉండాలి. రాత్రి పూట ఎవరైనా గుడిసె బయట ఉండొచ్చు కానీ లోపలికి రాకూడదు. పిల్లలని కూడా ముట్టుకోరు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం." - గ్రామస్థురాలు

ఎంతో జాగ్రత్తతో...పరిశుభ్రతలో ఉండాల్సిన సమయాల్లో మూఢ నమ్మకాలు, వింత ఆచారాల పేరుతో బాలికలను, స్త్రీలను ఆఖరికి పసిగుడ్డులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు జిజి హట్టి గ్రామస్థులు.

అసలు... ఊరిలో ఇలాంటి వింత ఆచారాలు... ఎలా వచ్చాయి, ఇంకా ఎందుకు ఉన్నాయి.... ఎందుకు రూపుమాపలేకపోతున్నారో... అక్కడివారి మాటల్లోనే విందాం.

"నేనూ ఈ ఊరిలోనే పుట్టాను. మా అమ్మ కూడా ఇలానే బాధపడింది. ఆడపిల్లలకు వయసొచ్చినప్పుడు కచ్చితంగా ఐదారురోజులు ఇలా ఊరి బయట ఉండాల్సిందే. నెలసరి సమయంలోనూ, ప్రసవం తర్వాత ఇలాగే ఊరి బయట ఉండాలి. ఇది ఈ గ్రామ ఆచారం. ఎవరైనా మాలాంటి వాళ్లు వద్దని చెప్తే వినరు. ఊరికి ఏదో అపచారం జరుగుతుందని భావిస్తారు." -గ్రామస్థుడు

బాలింతగా 2-3 నెలలు గుడిసెలో గడిపాక...గుడికి వెళ్లి పూజ చేసిన తర్వాతే మళ్లీ వారిని ఇంట్లోకి అనుమతిస్తారు. తరాల తరబడి.. జిజి హట్టి సహా సమీప 7 గ్రామాల్లో ఇలాంటి దురాచారాలను రూపుమాపేందుకు అధికారులు, పాలకులు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.

ఇదీ చదవండి : COTTON SHORTAGE: దూదీ దారం లేవు !.. ఆందోళనలో ప్రభుత్వాసుపత్రుల వైద్యులు

ABOUT THE AUTHOR

...view details