ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్​ నిలిచింది.. ఆమె గుండె ఆగింది - గుండెపోటుతో మహిళ మృతి

YSR Pension Kanuka: ఎవ్వరూ లేని వారికి ప్రభుత్వమే దిక్కు. అటువంటి వారిని ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అటువంటి వారికి సాయం చేయడం మానేసి వారికి వస్తున్న ఎదోక కారణం చూపి పథకాలను ఆపేస్తున్నారు. తాజాగా ఏ దిక్కులేని ఆమెకు ప్రభుత్వం సాయం అందక గుండెపోటుతో చనిపోయిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Woman dies of heart attack after suspension of pension
పెన్షన్ నిలిపివేయడంతో గుండెపోటుతో మహిళ మృతి

By

Published : Feb 7, 2023, 5:31 PM IST

Updated : Feb 7, 2023, 9:47 PM IST

YSR Pension Kanuka: ప్రభుత్వ నిర్ణయాలు అభాగ్యుల పట్ల శాపంగా మారింది. ఇన్నాళ్లు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లపై బతికిన అనామకులు.. ఇప్పుడు అనేక కారణాలతో ఆ పింఛన్లు నిలిపివేయడంతో దిక్కుతోచక.. వృద్ధాప్యంలో ఏం చేయాలో తెలియక మనస్తాపంతో ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది.

రాయదుర్గంలోని రాజీవ్ గాంధీ కాలనీ గ్యాస్ గోడౌన్ సమీపంలో నివాసముంటున్న పాలక్క (43)కు వితంతు పింఛన్ నిలిపివేశారు. దీంతో మనస్తాపానికి గురై ఆమె మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. గత నాలుగేళ్ల క్రితం పాలక్క భర్త నాగరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. పాలక్క టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగించేది. భర్త మృతి చెందడంతో ప్రభుత్వం ఆమెకు వితంతు పెన్షన్ మంజూరు చేసింది. కానీ గత ఆరేడు నెలల క్రితం ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసింది. దీంతో ఆమె రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం చుట్టూ పెన్షన్ కోసం తిరిగి తిరిగి అలసిపోయింది.

పింఛన్​ ఆగిందని మనస్తాపంతోనే పాలక్క మృతి చెందిందంటున్న బంధువులు

ఈనెల 6 తేదీ అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తనకు అధికారులు పెన్షన్ నిలిపివేశారని కలెక్టర్ నాగలక్ష్మి వద్ద విన్నవించుకుంది. పెన్షన్ ఎందుకు నిలిపివేసారని.. వాలంటరీ వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. నిరుపేద మహిళ అయిన పాలక్కకు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతపురం వెళ్లి వచ్చిన ఆమె రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. బంధువులు ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించాలని సూచించారు. అంబులెన్స్ సిద్ధం చేసి ఆమెను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తుండగానే గుండెపోటుతో పాలక్క మరణించినట్లు బంధువులు వాపోయారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 7, 2023, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details