అనంతపురం జిల్లా ధర్మవరం సత్య సాయి నగర్లో.. ఓ గృహిణి ఆందోళన బాటపట్టింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు పోలీసులే న్యాయం చేయాలంటూ ధర్నా చేసింది.
2018లో వివాహం..
సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలినుంచి విషయం తెలుసుకున్నారు. ధర్మవరం సత్య సాయి నగర్‌కు చెందిన దీపక్ కుమార్‌కు, కడపకు చెందిన గాయత్రికి 2018 లో వివాహమైందని చెప్పారు.
రూ.కోటి కావాలని డిమాండ్..
వివాహ సమయంలో రూ.20 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలు ఇచ్చారని గాయత్రి పేర్కొంది. మళ్లీ అదనంగా రూ.కోటి కట్నం కావాలని అత్తింటి వారు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం పోలీసులు దీపక్ కుమార్ సహా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అక్కడే కేసు దాఖలు..
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే దీపక్ కుమార్ బెంగళూరులో నివాసం ఉంటున్నాడని.. అక్కడే కోర్టులో విడాకుల కేసు వేశాడని డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. కేసు వాయిదాకు గాయత్రి హాజరుకాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసిందన్నారు. గాయత్రి, దీపక్ కుమార్‌తో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి ఇరువురు అంగీకరిస్తే తిరిగి కలుసుకునే అవకాశం ఉందని డీఎస్పీ వివరించారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని ధర్మవరం పోలీసులను గాయత్రి వేడుకుంది.
ఇవీ చూడండి:
మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన