అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొందరు రైతులు, కార్మికులు సమీపంలోని వంకలు, పొలాల్లో ఉన్న ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తుండగా అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎడ్లబండ్లను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాయదుర్గం పట్టణ ప్రజలు, కార్మికులు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి ఈ విషయాన్ని చెప్పారు. అనంతరం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎడ్లబండ్ల యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. ఎడ్లబండిలో ఇసుక తరలిస్తే ఎలా పట్టుకుంటారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేస్తున్న కార్మికులను శాంతింపజేశారు. అధికారులను పిలిపించి ఎడ్లబండ్లలో ఇసుకను తరలిస్తే ఎలా స్వాధీనం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఎడ్లబండ్లలో తరలించరాదని ఏమైనా జీవో ఉంటే చూపించాలని అధికారులను ప్రశ్నించారు. ఎడ్లబండ్లలో ఇసుక రవాణా అంశంపై అధికారులు ప్రజలకు సహకరించాలని విప్ సూచించారు.