కరోనా రెండో దశ (సెకండ్ వేవ్)పై పోరుకు ప్రత్యేక బృందాలతో సిద్ధమైనట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తికి అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న క్రమంలో.. 50 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో తన ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా జనవరి 19 వరకు వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వివరించారు. చలికాలంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందునా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
మరోవైపు జిల్లాలో 1.10 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు. 14 వేల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2.05 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు.