Water supply Stopped to Handriniva: శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆయకట్టుకు అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని దశాబ్దాల కిందటే చేపట్టారు. తొలిదశలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్షా 98 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 216 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ తవ్వారు. జగన్ సీఎం అయ్యే నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి జలాశయాలను సైతం,.. నిర్మించారు.
ప్రధాన కాలువ నిర్మాణ పనులు 90శాతం పూర్తి కాగా భూసేకరణ 99శాతం పూర్తయ్యింది. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణమూ కొంతమేర జరిగింది. మిగిలిన డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి, మరో 305 కోట్లు ఖర్చు చేస్తే తొలిదశకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. కానీ మూడేళ్లలో కనీసం డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మంచలేదు. 613 కోట్ల రూపాయలుగా ఉన్న విద్యుత్ బకాయిలు 2 వేల 343 కోట్లకు పెరిగాయి. ఈ ఒక్క ఏడాది బకాయిలే రూ.380 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
హంద్రీనీవా ప్రధాన కాలువపై ఉన్న పంపుహౌసుల్ని మేఘ సంస్థ నిర్మించింది. వాటి నిర్వహణనూ అదే సంస్థకు అప్పగించారు. కొన్ని నెలలుగా నిర్వహణకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. 32 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మోటార్లలో గ్రీజు వేసే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. నీటి సరఫరా నిలిచిన నేపథ్యంలో నిధులు విడుదల చేస్తే చిన్నచిన్న మరమ్మతులు చేసుకుంటామని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగా భారీగా నీరురావడంతో రైతులు ధైర్యంగా పంటలు వేశారు. రెండు ఉమ్మడి జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగు చేశారు. ప్రభుత్వం నీళ్లివ్వలేక చేతులెత్తేయడంతో వారికి ఏం పాలుపోవడం లేదు. హంద్రీనీవాలో దాదాపు 12 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి