నీరు లేనిదే ప్రాణం లేదు. పంటలు, పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ప్రకృతి ఇస్తే తప్ప మరో రకంగా పొందలేని ఈ నీటిని ఇష్టానుసారం వాడేస్తున్నాం. మన ఇంట్లోని కొళాయిలో నీళ్లు దండిగా వస్తున్నాయి కదా.. మనకు నీటి సమస్య లేదనే అతి నమ్మకం వీడాలి. ఏటా నీటి కొరత మరింత తీవ్రతరం అవుతోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రభుత్వాలు, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో నైరుతి, ఈశాన్య రుతు పవనాల ప్రభావం వల్ల కురిసిన వర్షం నీటిని జాగ్రత్తగా వాడుకుంటే భవిష్యత్తులో జలగండం తప్పుతుంది.
- పదేళ్ల తర్వాత పుష్కలంగా..
అనంతపురం జిల్లా భౌగోళికంగా వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. రుతుపవనాలు కేరళ వైపు నుంచి జిల్లాలోకి ప్రవేశించే క్రమంలో కర్ణాటకలోని పశ్చిమ కనుమలు అడ్డుకుంటాయి. అక్కడ అధిక వర్షం కురుస్తుంది. ఆ తర్వాత జిల్లాలోకి ప్రవేశించే గాలులు బలహీనపడి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, తుపానుల వల్ల చెప్పుకోదగ్గ వానలు పడతాయి. 2020 మే నుంచి డిసెంబరు వరకు జిల్లాలో 747.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి డిసెంబరు నాటికి సగటు వర్షపాతం 493.9 మిల్లీమీటర్లు. అంటే 51.3శాతం అదనంగా వర్షం కురిసింది. ఈ క్రమంలో మే-2020లో సగటున 23.06 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టాలు, డిసెంబరు-2020 నాటికి 11.20 మీటర్లుపైకి ఎగబాకాయి. మే నుంచి డిసెంబరు వరకు జిల్లాలో భూగర్భజలాలు 11.86 మీటర్లు పెరిగాయి. ఇలా పెరగడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.
- అనంత నేలపై 504.93 టీఎంసీలు
గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో అధిక వానలు కురిశాయి. దీంతో డిసెంబరు-2020 నాటికి 504.93 టీఎంసీల వర్షంనీరు అనంత నేలపై పడింది. ఇందులో 60.59 టీఎంసీలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారాయి. బావులు, బోర్లలో నీటిమట్టాలు పెరిగాయి. ఫలితంగా జిల్లాలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిలో ఎండుముఖం పట్టిన బోర్లలో ప్రస్తుతం జలం పుష్కలంగా లభ్యమవుతోంది. యల్లనూరు మండలం పాతపల్లి ఫీజోమీటరులో అతి తక్కువగా 0.12 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. 63 మండలాల్లో 46 మండలాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయి.