అనంతపురం జిల్లా రైతులు గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా... అని ఎదురు చూస్తున్న తుంగభద్ర ఎగువ కాలువకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశాయం సకాలంలో నీరు చేరడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. జులై 31న తుంగభద్ర డ్యామ్ వద్ద నీరు విడుదల చేయగా.. ఆగస్టు ఒకటో తేదీ జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇప్పటి దాకా జిల్లా సరిహద్దుకు 3.977 టీఎంసీలు చేరాయి.
అయితే అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్న కాలువలకు, జలాశయం ఎంత నీరు కేటాయించాలన్నది సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబి) నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. అనంతపురం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో మూడు జిల్లాలో ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొంటారు. అయితే ఈ సమావేశం ఎప్పుడూ వాడీ వేడిగా సాగేది. కానీ ఈసారి ఐఏబీ సమావేశం లేకుండానే నీటి కేటాయింపులు చేశారు. కరోనా కారణంగా సమావేశం నిర్వహించలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రైతుల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులే నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 24.988 టీఎంసీలు వస్తాయన్న అంచనా మేరకు కేటాయింపులు చేశారు. అయితే ఎప్పటిలానే తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తూ 10 టీఎంసీలు కేటాయించారు. అలాగే సాగు నీటికి 14.988 టీఎంసీలు సాగుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.