అనంతపురం జిల్లాలో సత్యసాయి, శ్రీరామరెడ్డి తాగునీటి పథకాల్లో పనిచేసే కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవటంతో వారంతా ఏడు రోజులుగా సమ్మెబాట పట్టారు. జలదీక్ష, భిక్షాటన నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అనంతపురం జిల్లాలోని 70 శాతం గ్రామాల్లోని 3 లక్షల మందికి వారం రోజులుగా తాగునీరు అందటం లేదు. సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇటీవలే నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలపై సందిగ్ధం నెలకొంది.
శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు కూడా ఏడు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. 480 మంది కార్మికులు 8 నెలల వేతనాల కోసం అధికారులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవటంతో సమ్మెబాట పట్టారు. దాంతో అనేక గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వారం రోజులుగా రక్షిత తాగునీరు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కారించాలని అధికారుల్ని కోరుతున్నారు.