ప్రధాన ఎగువ కాలువ (హెచ్ఎల్సీ), హంద్రీనీవా కాలువ (హెచ్ఎన్ఎస్ఎస్).. ఈ రెండే జిల్లా ప్రధాన నీటి వనరులు. అటు తుంగభద్ర.. ఇటు శ్రీశైలం కృష్ణమ్మ గలగల సవ్వడి చేస్తూ.. వడివడిగా జిల్లాకు వస్తున్నాయి. ప్రజల దాహార్తి తీరుస్తూ.. కర్షకుల మోములో చిరునవ్వు పంట పండిస్తున్నాయి. ఇంతటి కీలకమైన జలాల సరఫరాలో ‘రాజకీయం’ నెలకొంది. నువ్వా, నేనా అంటూ పోటీపడుతూ ఎక్కడికక్కడ వృథా చేస్తున్నారు. దండిగా జలాలు వస్తున్నా.. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ లేకపోవడం బాధాకరం. ఈ దఫా వరుణడు నిండు మనసుతో కరుణించాడు.
భూగర్భ జలాల సమస్య తీరింది. 60 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాకు చేరుతున్న హెచ్చెల్సీ, హంద్రీనీవా నీటిని వీలైనంతగా ఆయకట్టుకు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. నేడు మంగళవారం అనంత రెవెన్యూ భవన్లో జిల్లా నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరగనుంది. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కర్నూలు, కడప జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. జిల్లాకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలు, అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
చౌర్యంపై నిఘా ఏదీ?...
అనంతపురం జిల్లాకు చేరుతున్న తుంగభద్ర, కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. హెచ్చెల్సీకి స్థిరీకరణ ఆయకట్టు ఉంది. పెద్దగా వృథా కావు. కానీ ప్రధాన కాలువపై వేలల్లో పైపులతో జల చౌర్యానికి పాల్పడుతున్నారు. వీటిని ఎక్కడికక్కడ నియంత్రిస్తేనే చివర ఆయకట్టుకు నీరు చేరేది. హంద్రీనీవాలో మరింత భిన్నమైన పరిస్థితి నెలకొంది. పైపులు వేయడమే కాదు.. కాలువకు గండ్లు పెడుతున్నారు. కొన్నిచోట్లా తెంపుతున్నారు. దీనివల్ల వాగు, వంకల్లో వృథాగా వెళ్తున్నాయి. మడకశిర ఉప కాలువ ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర ప్రాంతాలు, ఇటు కదిరి, పుట్టపర్తి వంటి కరవు ప్రాంతాలకు నీరు చేరేలా చూడాలి. జలవనరుల అధికారులదే కాదు.. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాలి. సమష్టిగా జల చౌర్యాన్ని అరికట్టాలి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయం కీలకం.
ఆయకట్టుకు చేరని హెచ్చెల్సీ నీరు..