అనంతపురం జిల్లా తనకల్లులో వర్షాల ధాటికి ఇంటి ప్రహరీ కూలిపోయింది. ప్రమాద సమయంలో మౌలాలి అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు. గోడ ఇంటి బయటి వైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. కూలి పనులు చేసుకుని జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకుని.. ఇల్లు కట్టించాలని బాధితులు కోరుతున్నారు.
అమిద్యాల నుంచి రాకెట్ల గ్రామానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌పై.. రోడ్డు పక్కనే ఉన్న ప్రహరీ కూలింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతింది. పెట్రోల్ బంకు వద్ద వాహనంలో ఇంధనం నింపుకుని రామాంజనేయులు అనే ట్రాక్టర్ డ్రైవర్ తిరిగివస్తుండగా.. ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల భారీ వర్షాలకు తోడు పాత గోడలు కావడంతో ఒక్కసారిగా కూలినట్లు గ్రామస్థులు తెలిపారు. మిగతా గోడా పడిపోయే స్థితిలో ఉండగా.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.