Votes Deletion Issue in Uravakonda Constituency: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురంలో గతంలో జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణీని సస్పెండ్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఆయన కంటే ముందు అదే స్థానంలో పని చేసిన స్వరూపా రాణి పైనా సస్పెన్షన్ వేటు పడింది. గతంలో అనంత జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపునకు బాధ్యురాలిని చేస్తూ సస్పెన్షన్ చేశారు. ప్రస్తుతం స్వరూపా రాణి బాపట్ల జిల్లాలో ఈటీసీ (Extension Training Centre)కు గెజిటెడ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 2020, 2021 సంవత్సరాలలో అనంతపురం జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో అక్రమంగా 1796 ఓట్లను తొలగింపుపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ మద్దతుదారులకు చెందిన ఓట్లను.. నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తొలగించారు.
ఫారం-7కు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా ఒకే దరఖాస్తుపై పెద్ద మొత్తంలో ఓట్లను జాబితా నుంచి తీసేశారు. దీనిపై ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గత సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.