BELUGAPPA ZILLA PARISHAD HIGH SCHOOL BUILDING : కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తరగతి గదులు సంవత్సరం తిరగకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాసిరకం వాటితో నిర్మించిన గోడలకు పగుళ్లు ఏర్పడి.. తలుపులు, కిటీకీలు చెదలుపట్టి, స్లాబ్ల పెచ్చులు ఊడి అధ్వానంగా తయారవుతున్నాయి. ఎక్కడి నుంచి ఏ పెచ్చులు ఊడిపడతాయో అని విద్యార్థులు అనునిత్యం భయపడుతున్నారు.
అనంతపురం జిల్లా బెళుగుప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి విడతలో భాగంగా నాబార్డ్ నిధులు ఉపయోగించి 10 తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 1.79 కోట్లతో 7 తరగతి గదుల నిర్మాణాన్ని 2020లో మొదలుపెట్టి 2022 జులై నాటికి పూర్తి చేసి అప్పజెప్పారు. అయితే పర్యవేక్షణ ఇంజినీర్, గుత్తేదారుడు కుమ్మక్కై గదుల నిర్మాణాలు నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
గదుల నిర్మాణాలకు వాడిన ఇటుకలు బూడిదతో కూడి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవే గదులపై ప్రస్తుతం రెండో విడతలో భాగంగా నాడు-నేడు పనులు కింద రూ. కోటితో మరో ఎనిమిది తరగతి గదులు నిర్మిస్తున్నారు. అయితే గదుల నిర్మాణాలకు అవసరమైన సిమెంటు ఇటుకలను గతంలో రూ.26 చొప్పున అనంతపురం నుంచి సరఫరా చేశారు. ప్రస్తుతం వాటిని తిరస్కరించి స్థానికంగా రూ. 29తో ఇటుకలు కొనుగోలు చేయడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే అధిక మొత్తానికి సిమెంటు ఇటుకలను కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.