అనంతపురం జిల్లాలో కొవిడ్ ఉద్ధృతితో పాటు బాధితుల కష్టాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. కేర్ సెంటర్లలోని సదుపాయాల కొరత వారిని రెట్టింపు ఆందోళనకు గురిచేస్తోంది. అనంతపురంలోని పీవీకెకె కళాశాల, ఎస్కే వర్శిటీలోని కేర్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవని బాధితులు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 5 వేల పడకలు ఏర్పాటుచేశామని అధికారులు చెబుతున్నా... ఎక్కడా కనీస సదుపాయాలు లేవని వాపోతున్నారు.
హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు బాధితులు ఇష్టపడకపోతుండటం వల్ల... జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో రోగుల సంఖ్య పెరుగుతోంది. వారికి తగినట్లుగా సదుపాయాలు కల్పిచండంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య తగ్గించే చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. హోం ఐసోలేషన్‌లోనే బాధితులను ఉంచేందుకు చర్యలు చేపడతామని అంటున్నారు. వయసు పైబడిన వారు, తీవ్ర వ్యాధి లక్షణాలతో బాధపడేవారినే ఆసుపత్రుల్లో ఉంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.