అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదర్శ పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు రహదారి సమస్య, ఇటు బస్సు సౌకర్యం లేకపోవడంతో 2 నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులకు లాక్‌డౌన్‌కు ముందు ముష్ఠూరు గ్రామానికి బస్సు సర్వీసులు ఉండేవి. తిరిగి ఇటీవల ఆర్టీసీ సర్వీస్ నడపడానికి ట్రయల్ నిర్వహించారు. వర్షాకాలంలో రహదారి గుంతలమయంగా మారటంతో అధికారులు సర్వీసులను నడిపించేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ కారణంగా... విద్యార్థులు పాఠశాలకు సరైన సమాయానికి చేరుకోలేక అగచాట్లు పడుతున్నారు. చిన్న ముష్ఠూరు గ్రామం నుంచి పాఠశాలకు సుమారు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు ఆటోలో పరిమితికి మించి ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ పాఠశాలకు చేరుకుంటున్నారు. విద్యార్థుల హాజరును ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆన్లైన్లో నమోదు చేయాలని, నడిచి వచ్చే విద్యార్థులు సకాలంలో చేరుకోకపోవడంతో వారి హాజరు నమోదు చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇక నైనా అధికారులు స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని విద్యార్థులు కోరుతున్నారు. వేసవి మొదలవడంతో ఎండ తీవ్రతకు విద్యార్థులు అంత దూరం నడవలేక అవస్థలు పడుతున్నారు. దీనిపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వివరణ కోరగా... ఆర్టీసీ అధికారులు చెప్పిన మేరకు రహదారి నిర్మాణం చేపట్టి బస్సు సర్వీసును తిరిగి నడిపేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశామని చెప్పారు.