అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఏడాదిన్నర క్రితం ఇళ్ల స్థలాలకు పట్టాలు అందుకున్న లబ్ధిదారులు రెవెన్యూ అధికారులు ఇళ్ల స్థలాలను ఎప్పుడు చూపిస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఇళ్ల స్థలాలకు పట్టాలు అందుకున్న లబ్ధిదారులపై రెవెన్యూ అధికారులు చేపట్టిన పునర్విచారణ పది రోజుల క్రితం ముగిసింది. తాజాగా పునర్విచారణలో 58 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
కొత్త ప్రభుత్వం రాగానే పునర్విచారణలో 3086 పట్టాల్లో 189 మంది లబ్ధిదారులను తొలగించారు. తాజాగా చేపట్టిన పునర్విచారణలో 58 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 3086లో మొత్తంగా 247 మంది అనర్హులుగా తేల్చారు. మిగిలిన 2839 మందికి ఇళ్ల స్థలాలను ఎప్పుడు చూపిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పట్టాలు అందుకుని పునర్విచారణలో లబ్ధిదారులుగా నిలిచిన వారికి ఇళ్ల స్థలాలను ఎప్పుడు కేటాయిస్తారనే అంశంపై రెవెన్యూ అధికారులు స్పష్టతను ఇవ్వడం లేదు. లబ్ధిదారులు, నాయకులు దీని గురించి అడిగినా దాటవేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఆ స్థలాలను వారికి పూర్తి వివరాలతో చూపించనున్నట్లు పదిహేను రోజుల క్రితమే కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన కొత్త లబ్ధిదారులకు స్థలాల పంపిణీ కొనసాగుతుండగా.. పాత లబ్ధిదారులకు స్థలాలను చూపించే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో తెదేపా ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాల్లో అప్పటి సీఎం చంద్రబాబు ఫొటో ఉంది. దానితోపాటు పట్టాల్లో వివరాలను, కాలనీ పేరును మారుస్తూ తాజాగా కొత్త పట్టాలను ముద్రించి లబ్ధిదారులకు ఇస్తారన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే అర్హుల వివరాలను కూడా రెవెన్యూ అధికారులు బహిర్గతం చేయడం లేదని భావిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం..