జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు చెప్పగానే చెరువు పనులే గుర్తుకు వస్తాయి. ఏడాదిలో ఎన్ని రోజుల పని ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి చర్యలు చేపట్టింది. రైతుకు నిరంతర ఆదాయం అందించే విధంగా పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించింది. గత కొంతకాలంగా ఈ పథకం ప్రభుత్వం చేపట్టక పోవడంతో రైతులు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ ఏడాది జూన్‌లో ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులకు మొక్కల పెంపకానికి అనుమతి మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గుంతలు తీసింది మొదలు మొక్కలు నాటడం నుంచి మూడేళ్ల వరకూ సంరక్షణ, నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం కూలీలకు చెల్లించే మొత్తం కలుపుకొని రూ.2లక్షల చెల్లించనుండటంతో రైతులు పండ్ల మొక్కల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు అనుమతి మంజూరు చేస్తున్నారు.
లక్ష్యం 30 వేల ఎకరాలు
జిల్లాలో ప్రభుత్వం 15వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచాలని లక్ష్యాలను నిర్ధేశించగా అధికారులు 30 వేల ఎకరాల్లో పెంపకానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే 15వేల మొక్కల పెంపకానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. జూన్ చివరికి మిగిలిన 15 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడానికి కార్యాచరణ రూపొందించారు. రైతులకు సుస్థిర ఆదాయాన్ని అందించేందుకు డ్వామా చురుగ్గా చర్యలు చేపట్టింది. వీలైనంత వేగంగా మొక్కలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. గుంతలు తీసిన వారికి మొక్కలు తెప్పించే చర్యలు చేపట్టారు.
మొక్కలు ఇవే..
పండ్ల తోటల పెంపకంలో భాగంగా మామిడి, జామ, సపోటా, అల్లనేరేడు, చింత, చీనీ మొక్కలు నాటిస్తారు. మామిడి అయితే ఎకరానికి 70, చీని, జామ ఇతర మొక్కలు ఎకరానికి 100, సపోటా 60, నేరేడు 40, చింత 40 మొక్కలు ఇస్తారు. వీటిని నేరుగా రైతులకు అందజేస్తారు.