పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలు, గర్భవతులకు ఐసీడీఎస్ ద్వారా ఇవ్వాల్సిన పాల పాకెట్లు... సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డు పాలయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని రైల్వే వంతెన వద్ద విజయ డెయిరీకి సంబంధించిన వందల పాల పాకెట్లు రోడ్డు పక్కన పడేశారు. రక్తహీనతతో బాధపడే గర్భవతులు, పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య స్థితి మెరుగయ్యేందుకు ప్రభుత్వం ఈ పాల ప్యాకెట్లను సరాఫరా చేస్తోంది.
కరోనా కష్టకాలంలో పౌష్టికాహారం దక్కక వందలాది పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీడీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 100 లీటర్ల పాలు నేలపాలయ్యాయి. పాల పాకెట్ల పంపిణీలో సిబ్బంది అలసత్వం కారణంగా లబ్ధిదారులకు అందించడం ఆలస్యమై ఉంటుందని, వాటిని కేంద్రాల్లో పెట్టుకోవడం ఇబ్బందిగా భావించి గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు పక్కన పడేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. పేదలకు అందాల్సిన పాలను రోడ్డు పాలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.