అనంతపురం నగరం ఉమానగర్‌లో జరిగిన అరటి కాయల వ్యాపారి షేక్ షా వలీ హత్య కేసులో.. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హతుడు షేక్షావలీ అరటికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. నిందితులు కూడా ఇదే వ్యాపారం నిర్వహించేవారు. ముగ్గురూ సూర్యనగర్‌లోని మహబూబ్‌బాషా వద్ద అరటికాయలు కొనేవారు. ఈ క్రమంలో వలీ.. బాబాఫకృద్దీన్, సద్దాంపై ఆధిపత్యం చెలాయిస్తూ తరచూ తిట్టడం, దండించడం, కొట్టడం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యాపారులు కసి పెంచుకున్నారు. మనస్పర్థలు తారస్థాయికి చేరాయి.
షేక్ షా వలీ ఆధిపత్యాన్ని భరించలేకపోయారు. అరటికాయల మండి వ్యాపారి మహబూబ్‌బాషా వద్ద తీసుకెళ్లిన ఆటో ఇంజిన్ సీజ్ అయిన కారణంగా.. యజమాని నుంచి డబ్బులు ఇప్పించాలని షేక్షావలీ వద్దకు నిందితుల్దిరూ వెళ్లారు. ఇందుకు వలీ ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిందితులు విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ కేసులో నిందితులను సీఐ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు రెండు రోజుల్లో పట్టుకున్నారు. ఒకటో పట్టణ పోలీసులను ఎస్పీ సత్యఏసుబాబు, డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రశంసించారు.