కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తమ పొలాల్లో కూలీలుగా పనిచేయాల్సిన రోజులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలు తేనెపూసిన కత్తులని ఆయన విమర్శించారు. స్వేచ్ఛా, వాణిజ్య విధానం వచ్చాక రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ విధానం రెండు దశాబ్దాలకు పైగా ఆచరణలో ఉండగా..,దీన్ని కొత్తగా తీసుకొచ్చినట్లు మోదీ చెబుతున్నారన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలతో భవిష్యత్తులో వ్యవసాయ మార్కెట్లు ఉండవన్నారు. కార్పొరేట్ సంస్థలు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదాలుకు అధిక ధరలకు విక్రయించే వ్యవస్థకు మోదీ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలి
నైతికి విలువలు లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీఎం జగన్‌పై తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైకోర్టు ఇన్ని సార్లు ఛీవాట్లు పెట్టిన తరువాత కూడా జగన్ సీఎంగా కొనసాగటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు చిన్న విషయానికి ప్రశ్నించినందుకు గతంలో సీఎం నీలం సంజీవరెడ్డి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. వెయ్యిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా...ముఖ్యమంత్రి జగన్ కనీసం సిగ్గుపడటం లేదని ఎద్దేవా చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని ఎన్నికల కమిషనర్ కేంద్ర హోంశాఖకు లేఖరాశారంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తీరు ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని..,ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
గాంధీజీ ఆశయాలు సీఎం జగన్‌తోనే సాధ్యం: సజ్జల