అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రైఏజ్ సెంటర్‌తో కొవిడ్ బాధితులకు మానసిక స్థైర్యం పెరుగుతుందని.. ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ 1977 ఏడో తరగతి బ్యాచ్ స్టూడెంట్స్, ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. సర్వజన ఆసుపత్రిలో ట్రైఏజ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, సిలిండర్లు, కొవిడ్ బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ప్రపంచమంతా కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. మానవతావాదులు ముందుకు వచ్చి ట్రైఏజ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీరి స్ఫూర్తి మరెందరికో ఆదర్శనీయం కావాలన్నారు. ట్రైఏజ్ సెంటర్ వద్ద అదనంగా పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సెంటర్‌లో ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ అవసరాల కోసం అదనంగా మరో రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. కరోనా బారిన పడిన వారు శ్వాస సమస్యతో సర్వజన ఆస్పత్రికి వచ్చాక కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. దీన్ని గుర్తించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారని, ఈ యంత్రాల ద్వారా బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందించవచ్చన్నారు.